న్యూఢిల్లీ: చండీగఢ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పర్యటించారు. ఠాగూర్ స్టేడియంలో రైతులు, జావాన్లు కుటుంబాలను ముగ్గురు సిఎం పరామర్శించారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు సిఎంలు నివాళులర్పించారు. సాగు చట్టాలపై పోరులో అమరులైన కుటుంబాలకు, అమరులైన జవాన్ కుటుంబాలకు తెలంగాణ సర్కార్ తరుపున ఆర్థికసాయం అందించారు. ఢిల్లీ, పంజాబ్ సిఎంల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ… రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారని తెలిపారు. కేంద్రానికి రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదని ఆరోపించారు. దేశ చరిత్రలో పంజాబ్ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారన్నారు.
ఎందరో వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. హరితవిప్లవంతో పంజాబ్ రైతులు దేశం ఆకలిని తీర్చారని సూచించారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని తెలిపారు. కేంద్ర సర్కార్ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందన్నారు. బిజెపిని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రైతుల పోరాటానికి మేం సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని కెసిఆర్ గుర్తుచేశారు. భగత్ సింగ్ వంటి వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యం సాధించారు. పంజాబ్ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా దేశం పరిస్థితి మారలేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
CM Sri KCR speaking at the event of handing over cheques to bereaved families of farmers and army personnel in Chandigarh. https://t.co/PFt5MldfE5
— Telangana CMO (@TelanganaCMO) May 22, 2022