మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పరువు హత్యలపై పోలీసులు శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరువు హత్యల కేసులకు సంబంధించిన పక్కా సాక్షాలు, ఆధారాలు సేకరించాలని అన్ని జిల్లాల ఎస్‌పిలకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న పరువు హత్యల కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని, పరువు హత్యల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా పరువు హత్యల కేసులలో తగిన సాక్షాలు కోర్టుకు సమర్పించి ఆయా హత్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలోని నాగరాజు, నీరజ్, గతంలో అల్వాల్‌లో జరిగిన నందకిషోర్ హత్యకు సంబంధించిన వివరాలను, వాటి ఆధారాలను సేకరించి సకాలంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.
ఇటీవల కాలంలో సరూర్‌నగర్‌కు చెందిన బి.నాగరాజు అశ్రిన్ సుల్తానాను ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో అశ్రిన్ అన్నయ్య మహ్మద్ మొబిన్ అహ్మద్, తన బావ మహ్మద్ మసూద్ అహ్మద్‌తో కలిసి నాగరాజును సెంట్రిగ్ రాడ్, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. తాజాగా బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్ పన్వార్ అదే కాలనీకి చెందిన సంజనను ప్రేమించాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకొన్న నీరజ్,సంజలను పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో నీరజ్ తన తాతతో కలిసి బైక్‌పై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో నలుగురు దుండ గులు నీరజ్‌ను చుట్టుమట్టు కత్తులతో పొడిచి, రాళ్లతో మోది హత్య చేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం హుజూరాబాద్‌లో గడ్డికుమార్, యాదాద్రి భువనగిరి జిల్లాలో నరేష్, మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం పరిధిలోని కలమడుగు గ్రామంలో ప్రేమ వివాహం చేసుకుందని కూతురిని తల్లితండ్రులు కర్రలతో కొట్టి చంపేసిన కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు.
ఈ క్రమంలో పరువు హత్యల కేసులలో నిందితులకు కఠిన శిక్షలు పడితేనే ఈ తరహా హత్యలను నియంత్రించ వచ్చని పోలీసు బాసులుభావిస్తున్నారు. రాష్ట్రంలో పరువు హత్యల చోటుచేసుకోకుండా ఇరు కుటుంబాల సభ్యులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామని పోలీసు బాసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లలో ప్రేమ వివాహం చేసుకున్న వారి ఇరు కుంటుంబాల పెద్దలను పిలిపించి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.