తీర్పు రిజర్వ్
లక్నో : జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం నాటికి రిజర్వు చేసింది. హిందూ వర్గం దాఖలు చేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ చేసిన ఒక పిటిషన్‌ను జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలు లోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు. జ్ఞానవాపి ప్రాంగణం లోని శృంగార గౌరి కాంప్లెక్స్‌లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగు చూసిన శివలింగాన్ని ఆరాదించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు , శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూ వర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్టు కింద జ్ఞానవాపి సర్వేను పరిగణన లోకి తీసుకోవాలని కోరుతోంది.