ఎఫ్‌డిఎకు డేటా సమర్పించడానికి యత్నం
వాషింగ్టన్ : ఐదేళ్ల లోపు పిల్లలకు ఫైజర్ టీకా మూడు డోసులు రక్షణ కలిగిస్తాయని ఫైజర్ సంస్థ సోమవారం వెల్లడించింది. పసి పిల్లలకు టీకా అందుబాటు లోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ముందడుగుగా ఈ వారం తరువాత అమెరికా ఔషధ నియంత్రణ మండలికి ( ఎఫ్‌డిఎ) డేటా సమర్పించడానికి ఫైజర్ సిద్ధమౌతోంది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పసికందులకు కొవిడ్ టీకా ఇవ్వాలని కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్న సమయంలో ఈ వార్త వెలువడింది. అమెరికాలో ఐదేళ్ల లోపు పసివారు 18 మిలియన్ వరకు ఉండగా వారందరినీ ఒక గ్రూపుగా పరిగణిస్తున్నారు. అయితే వీరింకా వ్యాక్సినేషన్‌కు ఇంకా అర్హులు కాని స్థితిలో ఉన్నారు. అయితే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ పోటీ దారులైన మోడెర్నా నుంచి డేటాను విశేషిస్తోంది. ఆ సంస్థ వేసవి నాటికి పసిపిల్లల కోసం రెండు టీకాలు అందుబాటు లోకి తేవాలని యోచిస్తోంది.
అయితే ఈమేరకు సమీపించడానికి ఫైజర్‌కు కొన్ని ఎగుడుదిగుడులు ఉన్నాయి. పెద్దలు తీసుకునే డోసులో పదోవంతు డోసైనా పసిపిల్లలకు అందివ్వాలని ఫైజర్ యోచిస్తోంది. కానీ స్కూలుకు ఇంకా వెళ్లని చిన్న పిల్లలకు రెండు డోసులు అంత రక్షణ ఇవ్వడం లేదని ట్రయల్స్‌లో బయటపడింది. అందువల్ల పరిశోధకులు శీతాకాలంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న సమయంలో 6 నెలల నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లలు 1600 మందికి మూడో డోసు అందించారు. ఈ విధంగా అదనపు డోసుగా మూడో డోసు ఇవ్వడంతో పసి పిల్లలో వైరస్‌ను ప్రతిఘటించే యాంటీబాడీల స్థాయిలు బాగా పెరిగాయని ఫైజర్ దాని భాగస్వామి బయోఎన్‌టెక్ వెల్లడించాయి. ఎఫ్‌డిఎ ప్రమాణాల మేరకు అత్యవసర వినియోగానికి ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా ఈ డోసులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.