ఉక్రెయిన్ సైనికాధికారి వెల్లడి
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఈ హత్యాయత్నం నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ విషయం వెలుగుచూడడం గమనార్హం. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కాకసస్ ప్రాంతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విఫల హతాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ ఉక్రెయిన్‌స్కా ప్రావ్డా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఇంటర్వూ పూర్తిగా మంగళవారం ప్రసారం కానున్నది. పుతిన్‌ను హతమార్చడానికి ప్రయత్నం జరిగిందని, ఆయనపై దాడి కూడా జరిగిందని కాకసస్ ప్రతినిధులు చెప్పారని బుడనోవ్ తెలిపారు.ఈ హత్యాయత్నంపై బహిరంగ సమాచారం లేదని, ఇది కచ్ఛితంగా విఫల హత్యాయత్నమని, సుమారు రెండు నెలల క్రితం ఇది జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉండగా.. కడుపులో ద్రవాలను తొలగించడానికి పుతిన్‌కు సర్జరీ జరిగిందని వార్తలు వచ్చిన కొద్ది వారాల తర్వాత ఈ హత్యాయత్నం సంగతి బయటకు రావడం గమనార్హం.