వంట నూనెల కట్టడికి, ద్రవ్యోల్బణం అదుపుకి కేంద్రం చర్య
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వంటనూనెల ధరలను కట్టడి చేసేందుకు ఏటా 20 లక్షల మెట్రిక్ టన్నుల ముడి సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను మినహాయిస్తూ కేంద్రప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. రెండు ఆర్థిక సంవత్సరాల పాటు (2022 23, 2023 24) ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్రఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటలో తెలిపింది. ఈ మినహాయింపు వల్ల దేశంలో వంటనూనెల ధరుల తగ్గడంతో పాటుగా, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడానికి దోహదపడుతుంది. వినియోగదారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ముడి సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు నూనెపై కస్టమ్స్‌సుంకంతో పాటుగా 5.5 శాతం అగ్రిఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సెస్ ఉంది. పెట్రోల్, డీజిల్‌తో పాటుగా వంటనూనెల దాకా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో టోకు ధరలు ఆధారిత ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిస్ఠ స్థాయి అయిన 7.79 శాతానికి చేరిన విషయం తెలిసిందే.