న్యూఢిల్లీ: కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌తోపాటు మరికొందరిపై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) చార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద వీరిపై ఢిల్లీ కోర్టులో ఇడి చార్జిషీట్ దాఖలు చేసినట్లు గురువారం అధికారులు తెలిపారు. 2018 సెప్టెంబర్‌లో శివకుమార్‌తోపాటు న్యూఢిల్లీలోని కర్నాటక భవన్ ఉద్యోగి ఎ హనుమంతయ్య, ఇతరులపై ఇడి మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. పన్ను ఎగవేత, హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ బెంగళూరులోని కోర్టులో శివకుమార్‌తోపాటు ఇతరులపై దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఇడి కేసు నమోదు చేసింది. శివకుమార్, ఆయన అనుచరుడు ఎస్‌కె శర్మ కలసి మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో పెద్ద మొత్తంలో నల్ల డబ్బును హవాలా మార్గాల ద్వారా తరచు రవాణా చేస్తున్నారని ఐటి శాఖ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. 2019లో శివకుమార్‌ను అరెస్టు చేసిన ఇడి ఈ కేసుకు సంబంధించి ఆయన కుమార్తె ఐశర్యను, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్‌తోపాటు మరికొందరిని ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో శివకుమార్ ప్రస్తుతం బెయిల్‌లో ఉన్నారు.
ED files Charge Sheet against DK Shivakumar