మరికొన్ని గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
ఈ ఏడాది సాధారణ వర్షాలే
చట్లబడ్డ వాతావరణం
తెలంగాణలో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: దేశ వ్యవసాయరంగానికి ఆయువుపట్టుగా ఉంటూ అన్నిరంగాల ఆర్ధిక పురోగమనానికి కీలకభూమిక పోషించే రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో ఇవి కేరళ రాష్ట్రాన్ని తాకబోతున్నాయి. నైరుతి అగమనం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20నుంచి స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఆరు రోజుల విరామం తర్వాత ఇవి కేరళరాష్ట్రం వైపు వేగంగా పయనిస్తున్నాయి. గురువారం నాటికి ఇవి దక్షిణ శ్రీలంకను కమ్మేశాయి. మరి కొన్నిగంటలో లక్షదీవులు , మాల్దీవులను రుతుపవనాలు చుట్టుముట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని కేరళలో పలు ్రప్రాంతాల్లో నల్లమబ్బులు కమ్మేశాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండురోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కేరళతోపాటు లక్షదీవుల్లోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాల గమనాన్ని నిరంతరం పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ సారి సాధారణ వర్షాలే:
దేశమంతటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖకు చెందిన నిపుణులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి ముందుగానే అవి వస్తున్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 27న ఇవి కేరళకు చేరుకుంటాయని అంచనా వేశారు.బంగాళాఖాతంలో ఇటీవల అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకన్నాయని వాతావరణ విశ్లేషకులు పేర్కొన్నారు. సాధారణం కంటే చాల ముందుగానే మే16ననే ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. అయితే మే 20తర్వాత బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికల్లో పెద్దగా మార్పులు సంభవించలేదని యూనివర్శిటి ఆఫ్ రీడింగ్ పరిశోధకుడు అక్షయ్ దేవరస్ వెల్లడించారు.
ఈ వేసవిలో 76శాతం అధికవర్షం :
ఈ ఏడాది వేసవిలో మార్చి తర్వాత దేశంలో 3శాతం అధిక వర్షపాతం నమోదుకాగా ద్వీపకల్పప్రాంతమైన దక్షిణ భారత్‌లో 76శాతం అధికంగా వర్షాలు కురిశాయి. తీవ్రమైన వడగాలుల ప్రభావంతో ఉత్తరాది ప్రాంతాల్లో పొడివాతావరణం నెలకొంది. వాయువ్య భారతదేశంలో 65శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, మధ్య భారతంలో 39శాతం తక్కువగా నమోదైంది. తూర్పు, ఈశాన్య భారత్‌లో 27శాతం అధిక వర్షపాతం నమోదైంది.
తెలంగాణ మరో మూడు రోజులు వర్షాలే:
గత మూడు రోజుల నుంచి పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు వేడిగాలులతో ఉడికెత్తిపోయిన రాష్టం ఒక్క సారిగా చల్లబడింది. గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆకాశంలో నల్లమబ్బులు ఆవహించాయి. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటిరియర్ కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తువరకూ స్థిరంగా కొనసాగుతున్నట్టు హైదరాబద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు , అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.