రాజస్థాన్‌తో బెంగళూరు ఢీ
నేడు క్వాలిఫయర్2 సమరం
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్15 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకోగా మరో బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్2 సమరం జరుగనుంది. ఇందులో గెలిచే జట్టు ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్ పోరులో బెంగళూరు విజయం సాధించి క్వాలిఫయర్2కు అర్హత సాధించింది. ఇక తొలి క్వాలిఫయర్2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్త్ కోసం బెంగళూరుతో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ రేసుకు దూసుకెళ్లాలనే పట్టుదలతో కనిపిస్తోంది. లక్నో మ్యాచ్‌లో రజత్ పాటిదార్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పాటిదర్ అజేయ శతకం సాధించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. కిందటి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ డుప్లెసిస్ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. మాక్స్‌వెల్ కూడా తన బ్యాట్‌కు పనిచెబితే బెంగళూరు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. పాటిదార్, లొమ్రార్, దినేశ్ కార్తీక్ తదితరులతో చాలెంజర్స్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరును సాధించడం కష్టం కాకపోవచ్చు. మరోవైపు హర్షల్ పటేల్, సిరాజ్, హాజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, హసరంగా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌కు బెంగళూరు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.
గెలుపే లక్ష్యంగా
మరోవైపు రాజస్థాన్ కూడా విజయమే లక్షంగా నాకౌట్ పోరుకు సిద్ధమైంది. గుజరాత్ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు ఈసారి తలెత్తకుండా చూడాలని భావిస్తోంది. జోస్ బట్లర్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈసారి కూడా చెలరేగేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్ ఝులిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా క్వాలిఫయర్1లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, పడిక్కల్, అశ్విన్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బౌల్ట్, అశ్విన్, ప్రసిద్ధ్, చాహల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో రాజస్థాన్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.