ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఇక లంక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటాలంటే బంగ్లాదేశ్ మరో 107 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో లంక బౌలర్ ఫెర్నాండో రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (0), హసన్ జాయ్ (15)లను అతను ఔట్ చేశాడు.
మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన నజ్ముల్ (2), కెప్టెన్ మోమినుల్ హక్ (0) కూడా పెవిలియన్ చేరారు. ఇక గురువారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముష్ఫికుర్ రహీం (15), లిటన్ దాస్ (1) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా వీరిద్దరే బంగ్లాను ఆదుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 506 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ 145 (నాటౌట్), చండీమల్ (124) శతకాలతో లంకకు ఆదుకున్నారు. కాగా, బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది.