హిందీ రేత్ సమాధి ఇంగ్లీషులోకి అనువాదం
లండన్ : ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం బుకర్ ప్రైజ్ 2022 భారతీయ రచయిత్రి గీతాంజలి శ్రీ సృష్టి టాంబ్ ఆఫ్ సాండ్‌కు దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ (గీతాంజలి పాండే) నవలా, లఘుకథల రచయిత్రిగా పేరొందారు. ఆమె హిందీలో రాసిన రేత్ సమాధి ఆంగ్ల అనువాద నవల టాంబ్ ఆఫ్ సాండ్ బుకర్ ప్రైజ్ దక్కించుకుంది.ఈ క్రమంలో పలు ప్రప్రధమతలు , ప్రత్యేకతలను సంతరింకుంది. హిందీ భాషలో వెలువడి తరువాత అనువదితం అయ్యి ప్రముఖ సాహితీ పురస్కారం దక్కించుకున్న తొలి భారతీయ భాషల రచన కూడా అయింది. ఈ నవలను ఆంగ్లంలోకి డైసీ రాక్‌వెల్ అనువదించారు. బుకర్ ప్రైజ్ పారితోషికం 50 వేల పౌండ్ల స్టెర్లింగ్‌లను ఇరువురికి సమానంగా పంచారు. గురువారం ఈ బుకర్ ప్రైజ్‌ను లండన్‌లో జరిగిన కార్యక్రమంలో గీతాంజలి అందుకున్నారు. తనకు బుకర్ దక్కుతుందని తాను అనుకోలేదని, అంతర్జాతీయ సాహిత్య పురస్కారం రావడం ఆనందం, ఆశ్చర్యం, గౌరవం కల్గించింది, సవినయంగా దీనిని స్వీకరిస్తున్నానని తెలిపారు. పోటీకి ఎంపికైన 13 నవలలో టాంబ్ ఆఫ్ సాండ్‌కు ప్రశంసలు దండిగా నిలిచాయి.
12 దేశాలకు చెందిన 11 భాషల నవలలు ఆంగ్లంలోకి అనువదించిన తరువాత పోటీ లిస్టులో మిగిలిన నవలలో గీతాంజలి శ్రీ రచన మేటిగా నిలిచింది. ఓ వ్యధార్థ జీవిత కథను ఇతివృత్తంగా చేసుకుని ఈ నవల రాశారు. భాషాతీతంగా ఇది ఖ్యాతిని దక్కించుకుంది. 80 సంవత్సరాల ఓ వృద్ధురాలు తన భర్త మృతితో తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతుంది. దేశ విభజన దశలో తనను వేధిస్తూ వచ్చిన గతాన్ని అధిగమించేందుకు, పాక్‌లో తన భర్త జ్ఞాపకాల గుర్తులను సందర్శించేందుకు వెళ్లిన వృద్ధురాలి జీవన పయనం ఈ నవలగా రూపొందింది. ఈ నవలకు బ్రిటిష్ పత్రికల నుంచి ఎటువంటి సమీక్షలు వెలువడలేదు. అయితే బుకర్ వేదిక నుంచి విజేతగా గౌరవం దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయి బుకర్ ప్రైజ్‌కు ఎంపికైన తొలి భారతీయ భాషా రచన , తొలి హిందీ నవల ఇదే కావడం కీలకం.