కుమార్తెను గొంతుకోసి హత్య చేసిన తల్లిదండ్రులు
ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం
మన తెలంగాణ/నార్నూర్: నవ మాసాలు మోసి కనీ, పెంచి, ఆలనా పాలనా చూసిన తల్లిదండ్రులే ఆమె పాలిట కాలయముళ్లయ్యారు. కన్నకూతురునే చేజేతులారా కడతేర్చుకున్నారు. ఈ హృదయ విదారకర ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో శుక్రవారం జరిగింది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందన్న కారణంగానే పవార్ రాజేశ్వరి(20) అనే యువతిని ఆమె తల్లిదండ్రులే కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని చూసి స్థానికులు భయాందోళకు గురై పోలీసులకు సమాచారం అందించగా.. సిఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై రవికిరణ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ఆ యువతి మృతి చెందింది. యువతి మృతదేహాన్ని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి సిఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని షేక్ అలీమ్, రాజేశ్వరి కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 45రోజుల క్రితం వారిద్దరూ కలిసి మహారాష్ట్రకు పారిపోయారు. తమ కుమార్తె కన్పించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు సావిత్రిబాయి, దేవీలాల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి అచూకీ కనుగొని మహారాష్ట్రకు ఒక బృందాన్ని పంపించి వారిద్దరినీ తీసుకువచ్చి యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో రాజేశ్వరికి తరచూ గొడవలు జరుగుతుండేవి. వేరే మతానికి చెందిన యువకుడితో రాజేశ్వరి వెళ్లిపోవడం, ఆమె తాము చెప్పినమాట ఎంతకీ వినకపోవడంతో రోజూ ఇంట్లో తగాదాలు పడేవారు. ఈ నేపథ్యంలో పరువు పోతుందనే ఉద్దేశంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులే రాజేశ్వరిని కత్తితో గొంతు కోసి హతమార్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సావిత్రిబాయి, దేవీలాల్‌ను పోలీసులు అరస్ట్ చేశారు.