గాంధీ పటేల్ కలల భారత సాకారం
సేవకుడిగా వచ్చి పేదల కోసం పాటుపడుతున్నా
గుజరాత్ అట్కోట్‌లో ప్రధాని మోడీ
50 కోట్ల రూపాయల మల్టీస్పెషాల్టీ ఆసుపత్రి ప్రారంభం
రాజ్‌కోట్ : ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో సిగ్గుతో తలదించుకునే స్థితికి తెచ్చే ఒక్క పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇన్నేళ్లుగా తాను తలవంచుకునే కారణం ఒకటి కూడా లేదన్నారు. దేశ ప్రజలకు సేవకుడిగా వ్యవహరిస్తానని చెప్పానని, ఈ క్రమంలో తాను శక్తివంచన లేకుండా పనిచేశానని ప్రకటించారు. ప్రజలు సిగ్గు పడే పరిస్థితిని తీసుకురాలేదన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని అట్కోట్ పట్టణంలో 200 పడకల మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ శనివారం ప్రసంగించారు. దేశ ప్రజలు సగర్వంగా నిలిచేలా చేసేందుకు పాటుపడ్డామని, ఈ ఎనిమిదేళ్ల తమ పాలనలో తప్పిదాలు చేయలేదు, ఇతరులు చేయడానికి అవకాశం కల్పించలేదని తెలిపారు. జనం సిగ్గుపడితే పాలకుల తప్పిదం అవుతుందన్నారు.
దీనిని గుర్తులో పెట్టుకునే తాము వ్యవహరించామని వెల్లడించారు. స్వతంత్ర భారతం ఏ విధంగా ఉండాలనేది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలు కన్నారని, ఈ కలల భారత నిర్మాణానికి తాము నిజాయితీ విశ్వసనీయతతో కృషి చేశానని వివరించారు. పేదల అభ్యున్నతే లక్షంగా తమ ప్రభుత్వం కదలిందని అన్నారు. పలు పేదల అనుకూల పథకాలను తీసుకురావడం ద్వారా తాము దేశ పేద ప్రజానీకానికి సేవలు అందిస్తున్నామని, ఈ క్రమంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా పేదలకు సాయం అందకుండా చూశామని తెలిపారు. కొవిడ్ 19 దేశాన్నే కాదు ప్రపంచాన్నే గడగడలాడించింది. పలు చిక్కులను తెచ్చిపెట్టింది. ఈ దశలో కూడా తమ ప్రభుత్వం క్రమం తప్పకుండా విధిగా పేదలకు ఆహారధాన్యాలను సరసమైన ధరలకు అందించిందని, ఇందులో ఉచిత కోటా కూడా ఉందని గుర్తు చేశారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు కొవిడ్ టీకా డోస్‌లు పొందే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.