టిఒడితో నాలుగేళ్ల సర్వీసు గడువు
పాతికశాతానికి పూర్తి స్థాయి సేవలు
త్వరలోనే రిక్రూట్‌మెంట్ పాలసీ
న్యూఢిల్లీ : సైన్యంలోని త్రివిధ బలగాలు పదాతి, నావికా, వాయుదళాలలో నియామక ప్రక్రియ పలు వినూత్న మార్పులు పిమ్మట భారీ స్థాయిలో జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్ నూతన విధానంలో అత్యంత గణనీయ సంస్కరణలు , మార్పులు చేపట్టారు. పలు ప్రతిపాదనలు చేశారు.ఇందులో అత్యంత ప్రధానమైనది త్రివిధబలగాలలోకి జవాన్ల స్థాయిలో స్వల్పకాలిక నియామకాలు జరుగుతాయి. ఈ విధానాన్ని టూర్ ఆఫ్ డ్యూటీ సంక్షిప్తంగా టిఒడిగా పిలుస్తారు. వివిధ సైనిక విభాగాలలో వృత్తిపరమైన ఆత్మస్థయిర్యం, విధుల పట్ల మరింత అంకితభావం క్రమంలో రిక్రూట్‌మెంట్ పాలసీని తీర్చిదిద్దినట్లు వెల్లడైంది. ఈ పాలసీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. టిఒడి పరిధిలో సైన్యంలోకితీసుకునే సిబ్బందిలో నూటికి నూరుమందిని నాలుగేళ్ల తరువాత సేవలనుంచి తప్పిస్తారు. తరువాత పూర్తిస్థాయి సర్వీసులోకి 25 శాతం మందిని తీసుకుంటారు. తాత్కాలికంగా తీసుకుని తిప్పిపంపించే వారిలో సమర్థతలను బట్టి కొందరిని పూర్తి స్థాయి సేవలకు తీసుకునే వీలుంది. ప్రత్యేకించి టూర్ ఆఫ్ డ్యూటీపైనే సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది, ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా చూసుకున్న తరువాతనే పూర్తిస్థాయి రిక్రూట్‌మెంట్ పాలసీని అధికారికంగా ప్రకటిస్తారని అనధికారికంగా వెల్లడైంది.
సైనిక దళాలలోకితీసుకునే వారిలో జవాన్ల స్థాయి వారికి నిర్థిష్టంగా నాలుగేళ్ల కాంట్రాక్టు దశ ఉంటుంది. తరువాత అధికారికంగా వారు వైదొలగాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో వీరిలోని పాతిక శాతం మందిని తిరిగి సర్వీసుల్లోకి తీసుకోవడం, తిరిగి మరో నాలుగేళ్ల కాంట్రాక్ట్ బ్యాచ్ ఉండటం వంటి కీలక పరిణామాలు ఉంటాయని వెల్లడైంది. అయితే ఆర్మీలో కాంట్రాక్టు ప్రాతిపదిక నియామకాల నుంచి కొన్ని విభాగాలను మినహాయిస్తారు. వారిని నాలుగేళ్ల కాలానికి మించి ఉద్యోగాలు లేదా సేవలలో ఉంచుతారు. ఐటి ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానపు ఉద్యోగాలకు సంబంధించి నాలుగేళ్ల పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. ఆర్మీ వైద్య విభాగాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే వారికి కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది. గడిచిన రెండేళ్లుగా సైన్యంలో కొత్త నియామకాల ప్రక్రియ జరగలేదు. దీనితో యువతలో నిరుత్సాహం తలెత్తింది. ఎప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఉంటుందా? అనే ఆత్రుత యువతలో నెలకొంది, ఈ మధ్యకాలంలో హర్యానా , పంజాబ్‌లలో రిక్రూట్‌మెంట్ల జాప్యంపై యువత నిరసన ప్రదర్శనలకు దిగారు.
నియామకాల ప్రక్రియ వచ్చే సరికి తాము వయో అర్హత పరిమితిని దాటిపోతామని, ఈ విధంగా సైన్యంలో చేరాలనే తమ జీవితాశయం నెరవేరకుండా పోతుందని ఎక్కువగా సైన్యంలో చేరేందుకు మొగ్గు చూపే ప్రాంతపు యువత ఆవేదన వ్యక్తం చేసింది. హర్యానాలో కొన్ని చోట్ల యువత ఆర్మీలో నియామకాల ప్రక్రియ ప్రకటనలలో జాప్యంతో విసిగి వేసారి ఆత్మహత్యలకు కూడా కొందరు యువకులు పాల్పడ్డారు. అత్యధిక సంఖ్యలో యువతను సైన్యంలోకి తీసుకోవడం వారిని నాలుగేళ్ల పాటు విధులలోకి తీసుకోవడం వల్ల వారి ఉత్సాహాన్ని సైనికపరమైన పాటవాల ఇనుమడింపునకు వినియోగించుకోవచ్చునని సైన్యం భావిస్తోంది. ఇదే సమయంలో సైనికులుగా కొనసాగాలనుకునే వారిని గుర్తించి వారిని పూర్తిస్థాయిలో సైన్యంలోకి తీసుకుంటే వారు భవిష్యత్తులో మరింత రాణించేందుకు వీలేర్పడుతుంది. ఇదే దశలో సైన్యంలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఇష్టం లేనివారు నాలుగేళ్లు పూర్తి కాగానే వైదొలిగేందుకు తమ వృత్తిని మార్చుకునేందుకు వీలేర్పడుతుంది.