అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అడివి శేష్ మీడియాతో మాట్లాడుతూ “సాధారణంగా బయోపిక్‌లలో యదార్థ కథను పొడిపొడిగా టచ్ చేస్తారు. కానీ ‘మేజర్’లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు సంబంధించిన గొప్ప కథ ఉంది. హీరోకు భజన కొట్టే కథ కాదు. మామూలు బయోపిక్‌లకు భిన్నంగా ఉండే కథ ఇది. ఈ బయోపిక్‌ను బాలీవుడ్ వారు, మలయాళం వారు తీస్తామని ముందుకు వచ్చారు. కానీ హీరోలు తమ కొడుకులా లేరని సున్నితంగా తల్లి తిరస్కరించారు. నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నేను ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు సంబంధించిన 31 సంవత్సరాల కథను కొన్ని సందర్భాలలో కొంత కల్పితానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇందులో ఐదు సంఘటనలను ఒకే సీన్‌లో చూపించాల్సి వచ్చింది. సినిమాలో హీరోయిన్లు సాయి మంజ్రేకర్, శోభితా దూళిపాళ ఉన్నారు. సందీప్ జీవితంలో ఒకరు ప్రజెంట్, ఒకరు పాస్ట్‌లో ఉన్నారు. ఆయన చిన్నతనం నుంచి స్కూల్, ఉద్యోగం, పెండ్లి అనేది ఒక భాగమైతే, కాశ్మీర్, కార్గిల్ అనేది మరో భాగం. మహేష్ బాబు ఈ సినిమా చూశాక కన్నీళ్లు పెట్టి నన్ను కౌగిలించుకొని గర్వంగా ఉందని చెప్పారు”అని అన్నారు.
Adivi Sesh talks with Media about Major