మనతెలంగాణ/హైదరాబాద్: సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మేఘా కన్వెన్షన్‌ను ఆయన ప్రారంభించారు. టిటిఎ ప్రతినిధి ఫైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను వర్తమాననికి అందించాలని ప్రవాస తెలంగాణవాసులను కోరారు. తెలంగాణకు మాత్రమే మానవీయ కోణాన్ని ఆవిష్కరించే రీతిలో ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన బతుకమ్మ సంప్రదాయం మనకు సొంతమైందన్నారు. బతుకమ్మతో పాటు బోనాలు, గ్రామదేవతల పేరుతో నిర్వహించే జాతరలతో మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చు అన్నారు. తెలంగాణా ఉనికిని అమెరికాలో చాటేందుకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు పోతున్న తెలంగాణా అమెరికా తెలుగు సంఘాన్ని ఆయన అభినందించారు. అంతకుముందు మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని తెలంగాణా అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిటిఎ చైర్మన్ మోహన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Jagadish Reddy inaugurates Mega Convention in New Jersey