హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దళితబంధు కార్యక్రమంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ సమీక్షలు జరిపారు. దళితబంధు చరిత్రలో ఎవరూ ఊహించని కార్యక్రమం అని, దళితులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే సిఎం కెసిఆర్ లక్షమని స్పష్టం చేశారు. మొదటి విడతలో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు ఎంపికైన వారికి దళితబంధు అందజేస్తామన్నారు. రేపటి నుంచి రెండో విడతకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అందరూ ఒకేలా కాకుండా నూతన వ్యాపారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి ఏం మాట్లాడాలో కూడా వాళ్లే చెప్తారా? అని తలసాని అడిగారు. మంత్రి మల్లారెడ్డి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేశారని, కార్పొరేషన్ పెడుతున్నామని ఒక ముక్క చెప్పి వెళ్లిపోవాలా? అని అడిగారు. వయసురీత్యా కూడా మంత్రి మల్లారెడ్డికి మర్యాద ఇవ్వాలన్నారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై వాళ్ల వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.