న్యూఢిల్లీ: సెప్టెంబర్ నుంచి ప్రతి నెలా నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. జాతీయ రైల్వే అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బుల్లెట్ రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కూడా పురోగతిలో ఉందని చెప్పారు. ఇప్పటికే న్యూఢిల్లీవారణాసి, న్యూఢిల్లీ వైష్ణోదేవీ ఖత్రా మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మరో రెండు వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ఆగస్టు నాటికి అందుబాటు లోకి రానున్నాయని వెల్లడించింది. ఈ రెండు ట్రైన్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారీ చివరి దశలో ఉన్నాయని పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా 75 నగరాలను కలుపుతూ 75 కొత్త వందే భారత్ రైళ్లు రానున్నాయని గత ఏడాది ఆగస్టు 15 వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Every month starts 4 Vande Bharat Trains from September