నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఖట్మాండు: నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో ఆదివారం కుప్పకూలిన తారా ఎయిర్‌వేస్‌కు చెందిన విమాన శకలాల నుంచి సోమవారం 20 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. నలుగురు భారతీయులతో సహా 22 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానంపొఖారా నగరం నుంచి బయల్దేరిన కొద్ది నిమిషాలకే ముస్తాంగ్ జిల్లాలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. పొఖారా నుంచి జామ్సమ్ పట్టణానికి వెళుతున్న ఈ విమానంలో నలుగరు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీలతోపాటు ముగ్గురు నేపాలీ సిబ్బంది ఉన్నారు. ప్రమాద స్థలి నుంచి 20 మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది మరో రెండు మృతదేహాలకోసం గాలిస్తున్నట్లు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తోలా తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభమైన కొవాంగ్ బేస్ క్యాంప్‌నకు 10 మృతదేహాలను తరలించినట్లు ఆయన చెప్పారు. మిగిలిన మృతదేహాల కోసం జరుగుతున్న గాలింపు చర్యలలో నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసు, పరతారోహక సహాయక అధికారులు మొత్తం 100 మంది పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. విమాన ప్రమాదంలో 20 మంది మరణించడం పట్ల నేపాల్ అధ్యక్షుడు విద్యాదేవి భండారి సంతాపం ప్రకటించారు.