పాట్నా: బీహార్ మోతిహారీ జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్‌లో 40 రోజుల శిశువు పొట్టలో ఓ పిండం ఉండడాన్ని వైద్యులు చూసి ఆశ్చర్య పోయారు. ఈ చిన్నారి పొట్ట ఉబ్బెత్తుగా ఉండి శిశువు సరిగా మూత్రం పోయలేక పోతోందని చెబుతూ తల్లిదండ్రులు ఆ బిడ్డను మెడికల్ సెంటర్‌కు తీసుకొచ్చారు. డాక్టర్లు సీటీ స్కాన్ పరీక్షలు జరపగా అసలు విషయం బయటపడింది. స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యుడు తబ్రీజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శిశువు శరీరంలో పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని ఫీటస్ ఇన్ ఫెటుగా పిలుస్తారని, శిశువు కడుపులో ఇంకో పిండం పెరగడాన్ని ఇలా అంటారని తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుందని వివరించారు. ఈ విషయం తల్లిదండ్రులకు వివరించి, విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసినట్టు వెల్లడించారు. చిన్నారి బాగానే కోలుకుందని, డిశ్చార్జి చేసినట్టు తెలిపారు.
Foetus found growing inside newborn baby in Bihar