ప్రధాని మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను ముగించుకున్న సందర్భాన్ని బిజెపి పెద్దలు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సమయంగా చెప్పుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఏ పాటి మేలు చేసినా సంతోషంతో దానిని మెచ్చుకోడం అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఆ ప్రభుత్వం మరిన్ని మంచి పనులు చేయడానికి అది దోహదం చేస్తుంది. ప్రధాని మోడీ ప్రభుత్వ పాలనలో దుర్భిణీ వేసి చూసినా ఒక్క మంచి పని కూడా కనిపించదని నిస్సందేహంగా, నిర్భయంగా చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వం చేసిన అప్పు 2019 జనవరి నాటికే 50 శాతం పెరిగి రూ. 82 లక్షల కోట్లకు చేరుకున్నది. దేశాన్ని ఇంతగా అప్పుల ఊబిలో దించిన ఆయన పాలన ప్రజలకు ఏమి చేసిందంటే నిజంగా గుండు సున్నాయే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. 2016లో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో, సామాన్య జన జీవనంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో చెప్పనలవికాదు.
ఈ చర్య ప్రజల జేబుల్లోని డబ్బును అంతర్ధానం చేయించి రోజువారీ ఖర్చులకు కూడా బ్యాంకుల వద్ద క్యూలల్లో నిలబడి ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితికి వారిని నెట్టివేసింది. అలా క్యూలల్లో మరణించిన వారి సంఖ్య వందల్లో వుండడం గమనార్హం. అంతేకాకుండా నల్లధనాన్ని నిర్మూలించడానికే పెద్ద నోట్ల రద్దును చేపట్టామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకున్న గొప్పల బూటకం నగ్నంగా కళ్లకు కట్టింది. దేశంలోని నల్లధనం రూపు మాయకపోగా అదంతా చట్టబద్ధ కరెన్సీగా బ్యాంకుల్లోకి ప్రవేశించగలిగింది. పెద్ద నోట్ల రద్దు అనేక మంది జీవనోపాధులను కూడా దెబ్బ తీసింది. చైనాకు గుణపాఠం చెప్పాలంటే 56 అంగుళాల ఛాతీ గల నాయకుడు దేశానికి అవసరమని 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ స్వయంగా చెప్పుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత లడఖ్ వద్ద చైనాతో సంభవించిన గాల్వాన్ లోయ సైనిక ఘర్షణల్లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో 300 చదరపు కి.మీటర్ల భారత భూమిని చైనా ఆక్రమించుకొన్నదని వచ్చిన సమాచారం విదితమే. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రధాని మోడీ లడఖ్ ఘర్షణల్లో మన భూమి అంగుళమైనా కోల్పోలేదని అబద్ధమాడారు. రైతుల కూటిలో బుగ్గిచల్లడానికి, వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్లకు అప్పగించడానికి ఉద్దేశించి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వారి ఉద్యమ ఉధృతికి తట్టుకోలేక ఉపసంహరించుకోవడమే మోడీ ప్రజా వ్యతిరేక పాలనకు తిరుగులేని నిదర్శనం. అనుభవరాహిత్యం వల్లనో, ప్రజల వద్ద నుంచి విశేషంగా డబ్బు గుంజుకోవాలన్న దురాశతోనో ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు అవకతవకల వల్ల దేశం విశేషంగా నష్టపోయింది.
ఒక సమాచారం ప్రకారం 84 శాతం మంది భారతీయుల రాబడి తగ్గిపోయింది. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 60 లక్షల చిన్న, మధ్య తరహా దుకాణాలు మూతపడ్డాయి. దేశ ప్రజలు కొవిడ్‌తో నానా బాధలు పడుతున్నప్పుడు దేశంలోని ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల ఆదాయాలు రోజుకు రూ. వెయ్యి కోట్లు చొప్పున పెరిగాయని వెల్లడైంది. ఆ ఒక్క సంవత్సరంలోనే 142 మంది అతి సంపన్నులు రూ. 30 లక్షల కోట్ల లాభాలను గడించారని తెలిసింది. ప్రజలు అధిక ధరలతో, ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయి అష్టకష్టాలు పడుతుంటే వారి మధ్య మత చిచ్చు రగిలించి అందులో వారు మాడి మసి అయిపోతుంటే బిజెపి పాలకులు ఆనందించారు. దళితులు, మైనారిటీలపై కక్ష కట్టి సంఘ్ పరివార్ శక్తులు సాగిస్తున్న దుర్మార్గాన్ని ఆపడానికి ప్రధాని మోడీకి నోరు కూడా రాలేదంటే ఆయన ఈ సువిశాల భారతంలోఅందరి వాడు ఎంత మాత్రం కాడని చెప్పడానికి వెనకాడవలసిన పని లేదు.
ఒక వైపు ప్రజలను మతోన్మాద మత్తులోకి నెట్టి మరో వైపు వారి ఆస్తులైన పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుకు చవకగా కట్టబెట్టే పనిని చాకచక్యంగా జరిపి వేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదే. ప్రజలను కొల్లగొట్టి పండగ చేసుకోడమంటే ఇదే. సర్వసమాన హక్కులు అనుభవిస్తున్న ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చేయడానికి మోడీ పాలనలో కరడుగట్టిన హిందుత్వవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు.ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరిన్ని మందిరం మసీదు వివాదాలను రెచ్చగొట్టడానికి పథకం వేసుకున్నట్టు వార్తలు చెబుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు లక్నోలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిరం నిర్మాణం ప్రారంభమైన తర్వాత మన కర్తవ్య నిర్వహణకు మథుర, బృందావన్, వింధ్యవాసిని, నైమిష్‌ధామ్ వంటివి తిరిగి మేల్కొంటున్నాయని అన్నారు. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు నిర్విరామంగా మత కల్లోలాలను రెచ్చగొట్టడానికి బిజెపి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నదని బోధపడుతున్నది. ఈ విధంగా ప్రజలను అత్యంత దారుణంగా విభజించి, వారి మెడలకు కోడి కత్తులు కట్టి ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి ఆ రక్త ప్రవాహాల్లో స్నానం చేయడమే ప్రధాని మోడీ ప్రభుత్వ గొప్పతనమని భావించి సిగ్గుపడవలసి వుంది.