హైదరాబాద్: విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై బిజెపి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ మాట్లాడారు. టెండర్ల ద్వారా బిహెచ్‌ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేశామన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్‌ఇఎల్ ఇచ్చిందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి టెండర్ పిలిస్తే బిహెచ్‌ఇఎల్ పాల్గొందని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిహెచ్‌ఇఎల్ ఎవరి ఆధీనంలో ఉందో బండి సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.
బండికి ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఏముందో చూసుకొని మాట్లాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్‌ఎల్‌కు టెండర్లు అప్పగించామని, ప్రపంచవ్యాప్తంగా బిహెచ్‌ఇఎల్‌కు మంచి పేరు ఉందన్నారు. బిహెచ్‌ఇఎల్‌కు టెండర్ వస్తే ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడిగారని, బిహెచ్‌ఇఎల్ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ పని అప్పగించారని వినోద్ కుమార్ తెలియజేశారు. బిహెచ్‌ఇఎల్ ఇచ్చిన సామాగ్రి తుప్పు పట్టినా సామాగ్రి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని వినోద్ కుమార్ అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు. ఎంపిగా ఉండి బండికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కువ ధరలకు కంరెంట్ కొంటున్నారనేది పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. బండికి ఎ, బి, సి, డిలు కూడా తెల్వదని తమకు అర్థమైందని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని జలశక్తికి రాష్ట్ర సిఎండి లేఖ రాశారని గుర్తు చేశారు. రూ.6.76 నుంచి రూ.12 వరకు కరెంట్ కొనాలని కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందన్నారు.