మనతెలంగాణ/ హైదరాబాద్: మే నెలాఖరు వరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహార నిధులు రూ.86,912 కోట్ల మొత్తాన్ని విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధిత ఏప్రిల్, మే నెలలకు సంబంధిత పూర్తి జిఎస్‌టి పరిహార నిధులను మొత్తం విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తమ వనరుల నిర్వహణ, మూలధన వ్యయాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిఎస్‌టి పరిహార నిధిలో దాదాపు రూ.25,000 కోట్లు మాత్రమే ఉన్నప్పటికి.. కేంద్ర ప్రభుత్వం రుణాలను తీసుకొని సర్దుబాటు చేసింది. దేశంలో నిర్దిష్ట వస్తువులపై పన్నులను విధించి, సేకరించిన మొత్తాన్ని పరిహార నిధికి కేంద్రం జమ చేస్తోంది. పన్ను వసూళ్ల నుంచి వచ్చిన రాబడిని.. జిఎస్‌టి (రాష్ట్రాలకు నష్ట పరిహారం) చట్టం, 2017లోని నిబంధనల మేరకు ఈ పరిహారాన్ని రాష్ట్రాలకు కేంద్రం అందజేస్తోంది.
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సారానికి రాష్ట్రాలకు ద్వైమాసిక జిఎస్‌టి పరిహారం నిధులు సకాలంలోనే విడుదల చేశారు. వీటితో రాష్ట్రాల రక్షిత ఆదాయం 14 శాతం సమ్మిళిత వృద్ధితో పెరుగుతోంది. అయితే పన్నుల సేకరణ అదే నిష్పత్తిలో పెరగలేదు. కోవిడ్-19 కాలంలో రక్షిత రాబడి, పన్నుల సేకరణలో తగ్గింపుతో.. వాస్తవ ఆదాయ, రశీదు మధ్య అంతరాన్ని మరింత పెంచింది. నష్టపరిహారం తక్కువగా విడుదల చేయడంతో రాష్ట్రాల వనరుల అంతరాన్ని పూడ్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు రుణం తీసుకుంది. రాష్ట్రాల ఆర్థిక నిర్వహణను పరిగణనలోకి తీసుకొని కేంద్రం రెగ్యులర్‌గా జిఎస్‌టి పరిహారాన్ని విడుదల చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా పన్ను వసూళ్లుల్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహారం నిధులు తాజాగా విడుదల చేశారు. 2022 ఏప్రిల్, మే నెలల బకాయిలు రూ.17,973 కోట్లు, ఫిబ్రవరి, మార్చి రూ.21,322 కోట్లు, జనవరి 2022 వరకు చెల్లించాల్సిన పరిహారం రూ.47,617 కోట్లు.. మొత్తం రూ.86,912 కోట్లు విడుదల చేశారు.
Center Govt releases GST Funds to States