గిన్నిస్ రికార్డు సృష్టించిన గ్రెగ్ ఫాస్టర్
వాషింగ్టన్ : ప్రపంచం లోనే అత్యంత కారంగా చెప్పుకొనే కరోలినా రీపర్ మిరపకాయలు మూడింటిని ఏకంగా నమిలి మింగేసి ఒక వ్యక్తి కొత్త రికార్డు సృష్టించాడు. అమెరికాకు చెందిన గ్రెగ్ ఫాస్టర్ కేవలం 8.72 నిమిషాల్లోనే ఈ మిరపకాయలను ఆరగించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కరోనా రీపర్ మిరపకాయలు ఒక్కోటి దాదాపు 5 గ్రాముల బరువు ఉంటుంది. చూడడానికి క్యాప్సికమ్‌లా కనిపిస్తుంది. దీని నుంచి సగటున 16,41,183 స్కొవిల్ స్కేల్ యూనిట్స్ (ఎస్‌హెచ్‌యు ) ఉత్పత్తి అవుతాయని అమెరికా లోని సౌత్ కెరోలినా వింత్రాప్ యూనివర్శిటీ పరీక్షల్లో తేలింది. 2013 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో అత్యంత ఘాటైన మిరపగా నమోదైంది.
గ్రెగ్ ఫాస్టర్ చేసిన ఈ సాహసాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 8.72 నిమిషాల్లోనే అత్యంత వేగవంతమైన సమయంలో మూడు మిరపకాయలను నమిలి మింగేశాడని పేర్కొంది. అంతకు ముందు కెనడాకు చెందిన మైక్‌జాక్ పది నిమిషాల్లో కరోలినా రీపర్ మిరపకాయలను నమిలి మింగి గిన్నిస్ రికార్డుకెక్కాడు. అలాగే న్యూయార్క్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి మిరపకాయల పోటీలో పాల్గొని వీటిని తిని చాలా అస్వస్థతకు గురయ్యాడు. గత మూడు రోజుల నుంచి ఈ వీడియో వైరల్ కావడం సంచలనం సృష్టించింది. 23,000 లైక్‌లు నమోదు కాగా, 4,47,000 మంది చూశారు. “ఇదొక నరకం” అని ఒకరు , “ ఇది పిచ్చిరికార్డు’ అని మరొకరు, “ ఈ అవార్డును సేకరించడానికి నేను సజీవంగా ఉంటానని ఆశించక పోవడం ఉత్తమం” అని మరొకరు ఈ మిరపకాయల పోటీపై వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం.