పురుగుమందు తాగి చెరువులో దూకిన
దంపతులు, కుమారుడు, కుమార్తె
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విషాదం
మన తెలంగాణ/ఆదిభట్ల: పురుగుల మందు తాగి ఆపై చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్ సమీపంలోని కుర్మల్‌గూడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సిఐ నరేందర్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నగరంలోని సంతోషనగర్‌కు చెందిన ఖుద్దూస్ పాషా(37), ఫాతిమా(28) దంపతులు కుమారుడు మెహర్(9), కుమార్తె ఫిర్దౌశిబేగం(6) సంతానం. ఖుద్దూస్ వెల్డింగ్ షాప్‌లో పనిచేసేవాడు. కుటుంబంతో కలిసి కుద్దూస్ నిన్న కుర్మల్‌గూడకు వచ్చారు. రాత్రి సమయంలో వీరంతా పురుగుల మందు తాగి అనంతరం కుర్మల్‌గూడ చెరువులో దూకారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తపై ఖుద్దూస్ పాషా, ఓ కుమార్తెను బయటికితీయగా వారు అప్పటికే మృతిచెందారు.
మంగళవారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఫాతిమా, మరో కుమార్తె మృతదేహన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. నిన్న రాత్రి రూ.10వేలు కావాలని కుద్దుస్ పాషా తన బామ్మర్ది హమీద్‌ను అడిగారని సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇలా జీవచ్ఛవాలుగా మారడం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. కుటుంబ పెద్దలతోపాటు ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం మృత్యుఒడికి చేరడంతో అక్కడి దృశ్యం హృదయవిదారకంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి బలమైన కారణాలేంటో తెలియాల్సి ఉందని సిఐ నరేందర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు.