ప్రఖ్యాత గాయకుడు కెకె హఠాన్మరణం
కొల్‌కతాలో చిట్టచివరి ప్రదర్శన
ఫ్యాన్స్ చుట్టుముట్టిన దశలో కుప్పకూలారు
మృతిపై ముసురుకున్న రాజకీయ వివాదం
టిఎంసి ప్రభుత్వ వైఫల్యంపై బిజెపి విమర్శ
రాజకీయ మాటలొద్దని టిఎంసి ఎదురుదాడి
కోల్‌కతా : ప్రఖ్యాత బహుభాషా సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ (కెకె)మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. దక్షిణ కోల్‌కతాలోని నజరుల్ మంచా ఆడిటోరియంలో పాటల కచేరీ ప్రదర్శన తరువాత హోటల్ రూం వద్ద ఉండగా కుప్పకూలారు. వెంటనే ఆయనను సిఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం వంటి పలు భాషలలో తన పాటలతో ఆయన కోట్లాది మందిని ఆకట్టుకుని కెకె పాటంటే జనం ఆసక్తిగా ఎదురుచూసే ఉన్నత స్థితికి చేరారు. తెలుగులో ఆయన పలు ప్రముఖ హీరోలకు పాటలు పాడారు. చిరంజీవి , మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి పలువురు హీరోల సినిమాలలో ఆయన పాడిన పాటలు బహుళ ప్రచారం పొందాయి. ఆయన ఎక్కువగా ఎఆర్ రెహ్మన్ సంగీత నేపథ్యంలో పాడిన పాటలు జనాలకు మరింత చేరువగా మారాయి. హిందీలో కూడా ఆయన సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలలో పాటలు పాడారు. స్టేజీ ప్రదర్శనలో ఉండగానే ఇదే ఆయన చివరి పాటకచెరీగా మారి ఆయన మరణించడం సంచలనానికి దారితీసింది. కెకె మరణం అసహజమరణం కావడంతో అది వివాదానికి దారితీసింది.
బిజెపి , కాంగ్రెస్‌లు కెకె మరణంపై పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ లోపాలతోనే ఆయన ఆకస్మిక మరణం పరిస్థితి ఏర్పడిందనే బిజెపి నేతల వాదనను టిఎంసి తిప్పికొట్టింది. గాయకుడి విషాదమరణాన్ని కూడా బిజెపి తన రాజకీయ స్వార్థానికి వాడుకోవడం విచిత్రంగా ఉందని టిఎంసి తెలిపింది. మరో వైపు కెకె మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. మృతికి కారణాలు తెలియచేసే పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందాల్సి ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. కెకె బస చేసిన హోటల్ మేనేజర్ , సిబ్బందితో పోలీసులు మాట్లాడారు. న్యూమార్కెట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌లో కెకె మరణంపై అసహజ మరణం పరిధిలో కేసు దాఖలు అయింది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. వేదికపై కుప్పకూలిన తరువాత ఆయనను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా రికార్డు అయిన దృశ్యాలను సిసిటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పరిశీలిస్తున్నారు. స్థానికంగా రెండు కాలేజీలలో రెండు షోలలో పాల్గొనేందుకు కెకె ఇక్కడికి వచ్చారు. ్ల కెకె ఢిల్లీలో 1968 ఆగస్టు 23న జన్మించారు. తెలుగులో ఆయన పాడిన పాటలు దాయిదాయి కుందనాల బొమ్మ, అయామ్ వెరీసారీ , అలేబా అలేబా పాటలు పాపులర్ అయ్యాయి. గాయకుడు కెకె మృతిపట్ల ప్రధాని మోడీ, మమత బెనర్జీ సంతాపం తెలిపారు. వేలాదిగా యువ అభిమానాలు నెట్‌ద్వారా తమ స్పందనను తెలియచేస్తూనే ఉన్నారు.