జకార్తా : వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్మూలా ఇ కారు రేసులు జరుగుతాయి. మహీంద్రా రేసింగ్ , టీం ప్రిన్సిపల్ దిల్బాగ్ సింగ్ గిల్ ఈ విషయం తెలిపారు. మహీంద్రా రేసింగ్ కార్లు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో వస్తున్నాయి. 2014లో వీటిని రూపొందించారు. హైదరాబాద్ వీధులలో ఈ కార్ల రేస్ విషయంపై ఈ నెలాఖరులోగా ఓ అధికారిక ప్రకటన వెలువడుతుంది. హైదరాబాద్ కార్ రేసుపై అత్యంత ఆశాభావంతో ఉన్నామని చెప్పగలమని, తాము ఇప్పటికే తరచూ తెలంగాణ ప్రభుత్వంతో దీనిపై మాట్లాడుతూ వస్తున్నామని దిల్బాగ్ సింగ్ తెలిపారు. జకార్తాలో తొలిసారిగా జరుగుతోన్న ఫార్మూలా ఇ రేస్‌ల నేపధ్యంలో సింగ్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి కెటిఆర్ తెలంగాణను ఎలక్ట్రిక్ కార్లు ఇతర వాహనాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తూ వస్తున్నారు. ఈ దిశలో ఫార్మూలా ఇ రేస్ తమ లక్షసాధనలో ఓ మైలురాయి అని పేర్కొంటోంది. బహుశా ఈ కార్ల రేస్ హైదరాబాద్‌లోని ఓ సరస్సు చుట్టే ఉండే ప్రాంతంలో జరుగుతుందేమో, సాయంత్రం దాటిన తరువాత లైట్ల వెలుగుల్లో దీనిని నిర్వహించాలని అనుకుంటున్నామని వెల్లడించారు. నగరంలో జరిగే రేస్ కావడంతో దీని వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు.