Monday, December 23, 2024

తెలంగాణ గాంధీ కెసిఆర్: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖల్లో మార్పు

గ్రామాలు పచ్చదనంతో కళకళ లాడుతున్నాయి

పల్లె ప్రగతి తో గ్రామాలు బాగుపడ్డాయి

వచ్చే నెల నుండి 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు

రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన మహానుభావుడు కెసిఆర్

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

KCR is Telangana Gandhi

కరీంనగర్: తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం కెసిఆర్ లాంటి సీఎం ని చూడలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయాకర్ రావు తెలిపారు. 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ప్రారంభించిన అనంతరం మంత్రులు వాలీ బాల్ ఆడారు. క్రీడా ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. సిఎం కెసిఆర్ లా రైతులకు దేశంలో ఎవరూ చేయడం లేదని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? అడిగారు. కేంద్రం ఉపాధి హామీ,15వ ఆర్థిక సంఘం నిధులు బాకీ పడ్డదని, రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు నయా పైసా బాకీ లేకుండా ఇచ్చామని తెలిపారు.

తెలంగాణ రాక పూర్వం గ్రామాల్లో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదని, దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి 1000/- అందిస్తున్నామని, గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. దీనికోసం రూ. 165 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో పింఛన్లు ఇచ్చామన్నారు. వచ్చే నెల నుంచి 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు బాగుపడ్డాయని, గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగైందని, గ్రామాల్లో రోగాలు మటుమాయం అయ్యాయని చెప్పారు. గ్రామ పంచాయతీలు తమకు ఇష్టం వచ్చిన పనులు చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు. దేశానికి గాంధీ స్వాతంత్య్రాన్ని తెస్తే, తెలంగాణ కు స్వాతంత్ర్యాన్ని తెచ్చింది తెలంగాణ గాంధీ కెసిఆర్ అన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన కెసిఆర్ కు మనమంతా అండగా ఉండాలన్నారు.  మహిళలు మంచి ప్రాజెక్ట్ తో వస్తె వాళ్లకు స్త్రీ నిధి నుంచి డబ్బులు ఇప్పిస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మల్క పూర్ ఇప్పటికే రూ 5 కోట్ల రోడ్లకు ఇచ్చామని, మరిన్ని పనులకు కావల్సినన్ని నిధులు ఇస్తామన్నారు. మల్కాపూర్ గ్రామానికి కోటి రూపాయల నిధులు ఇస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పి సిఇఒ ప్రియాంక, అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జెడ్ పి టి సి పి, ఎంపిపి లక్ష్మయ్య, సర్పంచ్ కొట్టే జ్యోతి పోచయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News