న్యూఢిల్లీ : అసోం ఆరోగ్యమంత్రి హిమంత్ శర్మ దేశంలో కొవిడ్ తీవ్రతల దశలో పిపిఇ కిట్స్ కాంట్రాక్టులను స్వార్థానికి వాడుకున్నారని ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. అసోంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైరస్ పరీక్షలు నిర్వహించే పిపిఇ కిట్స్ సరఫరా లావాదేవీలను 2020 సంవత్సరంలో ఆరోగ్యమంత్రి ఇష్టారాజ్యంగా సాగించారని అన్నారు. పిపిఇ కిట్స్ డీల్‌లను అత్యధిక రేట్లకు మంత్రి భార్యకు , ఆయన కుమారుడి వ్యాపార భాగస్వాములకు కట్టబెట్టారని సిసోడియా ఆరోపించారు.
ఈ మేరకు పలు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఇతర కంపెనీల నుంచి పిపిఇ కిట్స్‌కు అసోం ప్రభుత్వం తమ రేటుగా ఒక్కంటికి రూ 600 చెల్లించింది. అయితే భార్య, కొడుకు సంబంధిత కంపెనీల నుంచి కిట్స్ తెప్పించుకుని వారికి రూ 990 చొప్పున చెల్లించారని, ఈ విధంగా కొవిడ్ తీవ్రతను తన కుటుంబ ఆర్థిక పరిపుష్టికి మంత్రి బాగా వాడుకున్నారని సిసోడియా విమర్శించారు.