దేశంలో నిరుద్యోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందుబాటులోని అపారమైన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని విశేషమైన ఆర్థికాభివృద్ధిని సాధించి పొరుగునున్న చైనా వంటి దేశాలతో పోటీ పడవలసిన దేశ పాలకులు ప్రజలకు తగిన పని కల్పించలేక వారిని సోమరిపోతులుగా తయారు చేసి తమ మతోన్మత్త కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడం అసత్యం కాబోదు. 2020లో దేశ జనాభాలో 67 శాతం మంది అంటే 90 కోట్ల మంది భారతీయులు పని చేసే వయసు (1564) లో వున్నారని, వీరి సంఖ్య 2030 నాటికి 100 కోట్లకు చేరుతుందని, వీరి సంఖ్య మాత్రం మరింతగా పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ఏటా కోటి 20 లక్షల మంది శ్రామికులు వచ్చి చేరుతున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. అంటే సంపద పెంచుకోడానికి చేపట్టే కార్యక్రమాలకు అవసరమయ్యే మానవ వనరులు దేశంలో విశేషంగా వున్నాయి. కాని అవి సద్వినియోగపడడం లేదు.
ఈ ఏడాది మార్చి నెలలో 32 లక్షల మంది కార్మికులు పనులకు దూరమయ్యారని భారత ఆర్థిక గమనాన్ని పరిశీలించే సంస్థ సిఎంఐఇ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) తెలియజేసింది. అప్పటికి ఎనిమిది మాసాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో కార్మికులు పనులకు దూరమయ్యారని వివరించింది. ఎంత ప్రయత్నించినా పనులు దొరకవనే నిశ్చితాభిప్రాయంతో వీరు ఉద్యోగాన్వేషణ మానుకున్నారని కూడా సిఎంఐఇ అభిప్రాయపడింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం విడ్డూరంగానూ, వినడానికి అసౌకర్యంగానూ వుంది. చదువులకు మళ్లిపోడం వల్లనూ, పిల్లలను, వృద్ధులను చూసుకోవలసిన అవసరం తలెత్తినందున అంత మంది కార్మికులు పని ప్రదేశాలను విడిచిపెట్టారని, నిరుద్యోగ తీవ్రత వల్ల కాదని కేంద్ర పాలకులు సెలవిచ్చారు. ఈ వివరణ కేంద్ర ఉద్యోగ కల్పన, కార్మిక శాఖ నుంచే వచ్చింది. గత మార్చిలో పనులకు దూరమైన 38 లక్షల మంది ప్రధానంగా అసంఘటిత రంగానికి చెందిన వారే అని బల్లగుద్ది చెప్పవచ్చు.
పెట్రోల్, డీజెల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినందున అన్ని సరకుల ధరలూ మిన్నంటాయి. దీనితో అవసరమైన పెట్టుబడి లభించక చేతిలో వున్నది చాలక చాలా పని ప్రదేశాలు మూతబడడమో, కార్మికుల సంఖ్యను తగ్గించుకోడమో జరిగింది. అంతేగాని కేంద్రం చెబుతున్నట్టు వారిలో అకస్మాత్తుగా చదువుల మీద దృష్టి మళ్లినందువల్ల లేక పిల్లలనూ, వృద్ధులనూ చూసుకోవలసిన అవసరం కలిగినందువల్లనో కాదు. గత మార్చిలో పరిస్థితి ఇలా వుంటే ఏప్రిల్‌లో నిరుద్యోగ సర్పం మరింతగా కోరలు చాచింది. నిరుద్యోగం పెరుగుదల రేటు మార్చి నెలలో 7.60 శాతం కాగా, ఏప్రిల్‌లో 7.83 శాతానికి చేరుకున్నదని సిఎంఐఇ తెలియజేసింది. నిరుద్యోగం పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా వుందని ఆ సంస్థ చెప్పింది. ఏప్రిల్‌ల్లో పట్టణ నిరుద్యోగం పెరిగిపోయి 9.22 శాతానికి చేరుకున్నదని ఈ పెరుగుదల మార్చిలో 8.28 శాతంగానే వుందని వివరించింది. అసంఘటిత రంగ అస్వస్థతకు ఇంత కంటే నిదర్శనం అక్కర లేదు. అసంఘటిత రంగంలోని చిన్నచిన్న కార్యస్థలాలు పట్టణ ప్రాంతాల్లోనే విస్తరించుకొని వుంటాయి. ఏప్రిల్‌లో హర్యానా రాష్ట్రంలో అత్యధిక నిరుద్యోగం రికార్డయిందని ఆ తర్వాత రాజస్థాన్, బీహార్‌లు వున్నాయని ఇఎంఐఇ తెలియజేసింది. హర్యానాలో నిరుద్యోగం పెరుగుదల రేటు 34.5 శాతం కాగా, రాజస్థాన్‌లో 28.8 శాతం, బీహార్‌లో 21.1 శాతంగా వుంది.
ద్రవ్యోల్బణంలో ధరల పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. వినియోగదార్ల ధరల సూచీ ప్రకారం గత మార్చిలో అంతకు ముందరి 17 మాసాల కాలంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం 6.5 శాతానికి ఎగబాకింది. టోకు ధరల సూచీ అంతకు ముందరి 4 మాసాల్లో వున్నదాని కంటే ఎక్కువగా, గరిష్ఠంగా 14.55 శాతానికి చేరుకున్నది. నిరుద్యోగం విపరీతంగా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితికి ధరల మితిమించిన పెరుగుదలే కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను అరికట్టే సదుద్దేశం తనకెంత మాత్రం లేదని పెట్రోల్, డీజెల్ ధరలను అదే పనిగా పెంచివేయడం ద్వారా కేంద్రం ప్రకటించుకున్నది. మత వైషమ్యాలను రాజేయడం ద్వారానేగాక ఆర్థిక రంగంలో కాకులను కొట్టి గద్దలకు వేయడం ద్వారా కూడా ప్రజల జీవితాలతో ఆడుకోడం తమకు ఇష్టమైన క్రీడ అని కేంద్ర పాలకులు చాటుకుంటున్నారు. దేశంలో వున్న పరిస్థితులతో అసంతృప్తి చెందిన విదేశీ పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతున్నాయని కూడా వార్తలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక రంగాన్ని స్వస్థతలోకి తెచ్చి ప్రగతి మార్గంలో పరుగులు పెట్టించాలంటే పని వయసులోని జనాభాను సద్వినియోగం చేయడం అత్యవసరం. అప్పుడే వారి శ్రమ దేశాభ్యుదయాన్ని చేకూర్చగలుగుతుంది.