గత ఐదురోజులు నుంచి పెరుగుతున్న పాటిజివ్ కేసులు
వాతావరణ ప్రభావంతో విస్తరించవచ్చని వైద్యులు వెల్లడి
నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు
నిర్లక్ష్యం చేస్తే నాలుగోవేవ్ తప్పదని అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా వైరస్ ఉనికి చాటుతుంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి గత ఐదారు రోజుల నుంచి పుంజుకుంటుంది. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మూడు నెలలుగా తక్కువగా ఉన్న కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలల్లో రోజుకు 16 నుంచి 20 కేసులు నమోదు కాగా మే నెలలో 25 నుంచి 30 కేసులు, జూన్ నెలలో 50 కిపైగా కేసులు నమోదైతున్నట్లు వైద్యశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజులు వైరస్ వ్యాప్తి చెందవచ్చని వైద్యులు భావిస్తున్నారు. దీనికి తోడు వానకాలం ప్రారంభం కావడంతో కరోనా పంజా విసురుతుందని అంటున్నారు. రెండు రోజుల కితం ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వైరస్‌పై ప్రజలు జాగ్రత్తలు చేపట్టాలే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖానికి మాస్కులు, భౌతికదూరం, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించే పరీక్షలు చేయించుకునేలా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ఈనెలలో నమోదైన పాజిటివ్ కేసుల పరిశీలిస్తే 1వ తేదీన 61 కేసులు, 2న 40మందికి, 3వ తేదీన 25మంది, 4వ తేదీన ఏకంగా 55 మందికి వైరస్ సోకింది. వాతావరణ ప్రభావంతో పాజిటివ్ కేసులు పెరిగే చాన్స్ ఉందని ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా షాపింగ్ మాల్స్, వస్త్ర వ్యాపారులు, కిరాణ దుకాణాలు, హోటల్స్ యాజమానులు ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాట్లు చేయాలని పేర్కొంటున్నారు నగరంలో కరోనా మొదటి డోసు వందశాతం, సెకండ్ డోసు 90శాతం పూర్తి అయినట్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు 15 శాతం వేసినట్లు, ఇంకో వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేస్తామని ఇంకా నగరంలో 15లక్షల డోసులు సిద్దంగా ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. డోసులు కావాల్సిన సమీపంలోని బస్తీదవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వెంటనే టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ పట్ల నగర ప్రజలు నిర్లక్షం చేసే మరో మహమ్మారి విశ్వరూపం దాల్చి ప్రాణాలు హరిస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.