తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం
5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి
లార్డ్: క్రికెట్ పుట్టినిల్లు లార్డ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టులో అతిధ్య జట్టు ఘన విజయం సాధించింది. మాజీ కెప్టెన్ జో రూట్ (115పరుగులు 170బంతుల్లో, 12×4) విరోచిత సెంచరీతో విజృంబించడంతో న్యూజిలాండ్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ 5వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 61పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ నాలుగో రోజు 216/5 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. జో రూట్.. ఏ దశలోనూ తన పట్టు సడలించలేదు. చివరి వరకూ క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ బెన్ ఫోక్స్ ( 32పరుగులు 92బంతుల్లో 3×4) కలిసి కీలక ఇన్నింగ్స్‌ను స్థాపించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 120పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ (202123)లో ఇప్పటికే 13 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌కు ఈ విజయంతో 2వ గెలుపుతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక సిరీస్‌లో (1-0)తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో వచ్చింది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో గెలుపుతో ఇంగ్లాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
రాణించిన డరైల్ మిచెల్, టామ్ బ్లండెల్
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 132పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ సైతం 141పరుగులకే ఆలౌటైంది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో డరైల్ మిచెల్ (203బంతుల్లో 108పరుగులు 12×4) సెంచరీతో ఆకట్టుకోగా.. టామ్ బ్లండెల్ (198 బంతుల్లో 96పరుగులు, 12×4) రాణించడంతో 285పరుగులు చేసింది. ఇకపోతే 277పరుగుల విజయ లక్ష్యంతో చివరి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఏమాత్రం శుభారంభం దొరకలేదు. కైలీ జేమీసన్ (4-/59) ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి వికెట్‌కు అలెక్స్ లీ (20పరుగులు)ను బోల్ చేసిన జేమీసన్, తర్వాత క్రాలీని స్లిప్ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 32పరుగులకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ఇక తర్వాత ఓలీ పోప్ (10)ను బౌల్ట్ అద్భుతమైన బాల్‌తో బౌల్ చేశాడు. తర్వాత బెయిర్ స్టో (16)ను కూడా జేమీసన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వలేదు. ఇక 69పరుగులకే 4వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది.
బాధ్యతగా ఆడిన జో రూట్
ఇక ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతలను మాజీ సారథి జో రూట్, ప్రస్తుత కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్నారు. స్టోక్స్ చూడచక్కని షాట్లతో హాఫ్ సెంచరీతో అలరించాడు. జో రూట్‌తో కలిసి 5వికెట్‌కు 90పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. స్టోక్స్ (54పరుగులు 110బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) ఔటయినా.. జోరూట్ మొండిగా క్రీజులో నిలిచి పోరాడాడు. బెన్ ఫోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను విజయం దిశగా నడిపించాడు. ఇక నాలుగో రోజు సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. 118టెస్ట్‌ల్లో 10000పరుగుల మైలురాయి కూడా చేరుకున్నాడు. ఇక కడవరకు క్రీజులో ఉండి చివరగా బౌండరీ బాది ఇంగ్లాండ్‌కు మరపురాని విజయాన్ని అందించాడు.