హోం మంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను 70 శాతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈశాన్య భారత్‌లోని 66 శాతానికి పైగా ప్రాంతాలలో సాయుధ దళాల(ప్రత్యేక అధికారాల) చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జాతీయ గిరిజన పరిశోధనా సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో గిరిజన ప్రాబల్య ప్రాంతాలే అధికంగా ఉన్నాయని, ఆ ప్రాంతాలలో భద్రతే అభివృద్ధికి అవరోధంగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 8 ఏళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాలలో 8,700 అవాంఛనీయ సంఘటనలు జరుగగా మోడీ ప్రభుత్వంలో ఇవి 1,700కి తగ్గిపోయాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 304మంది భద్రతా సిబ్బంది మరణించగా మోడీ ప్రభుత్వంలో కేవలం 87 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.