4.90 శాతానికి పెరిగిన రెపో రేటు
రేటు పెంపు ఐదు వారాల్లో రెండోసారి
ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగానే నిర్ణయం
యుపిఐతో క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానానికి అనుమతి
వెల్లడించిన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై : ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఆర్‌బిఐ మరోసారి వడ్డీ రేటును పెంచింది. రెపో రేటును 0.50 శాతం పెంచుతూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఎంపిసి నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి చేరింది. ఇక గృహ రుణాలు, ఇఎంఐలు మరింత భారం కానున్నాయి. బుధవారం ఎంపిసి (ద్రవ్యవిధాన సమీక్ష కమిటీ)లోని ఆరుగురు సభ్యులు వడ్డీ రేటు పెంపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గత నెల మేలో ఆర్‌బిఐ 0.40 శాతం రెపో రేటును పెంచగా, కేవలం ఐదు వారాల్లోనే మళ్లీ 0.50 శాతం రేటును పెంపు నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ(ఎస్‌డిఎఫ్) రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటును వరుసగా 4.65 శాతానికి, 5.15 శాతానికి ఆర్‌బిఐ పెంచింది. వృద్ధి రేటుపై కఠినంగా ఉండేందుకు ఆర్‌బిఐ సర్దుబాటు వైఖరిని మార్చుకోవాలనుకుంటోంది. 202223 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి సవరించింది. కానీ వృద్ధి రేటు అంచనాను మాత్రం 7.2 శాతం వద్ద గతంలో నిర్ణయించినదే కొనసాగించింది.
ద్రవ్యోల్బణంపై ఆందోళన
పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షం పరిధి దాటి వెళ్లడంతో శక్తికాంత దాస్ ఆందోళన చేస్తూ, రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరగొచ్చని అన్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం చాలా వరకు అంతర్జాతీయ, సరఫరా వ్యవస్థ అంశాలే అని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా పరిస్థితులు ప్రతికూలంగా మారాయని, దీని కారణంగా ధరలు పెరిగాయని దాస్ వివరించారు.
సహకార బ్యాంకుల్లో గృహ రుణాలపై పరిమితి పెంపు
కొఆపరేటింగ్ బ్యాంకుల నుంచి పొందే గృహ రుణాలపై పరిమితిని ఆర్‌బిఐ రెట్టింపు చేసింది. సరసమైన గృహాలకు మద్దతునందించేందుకు గాను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు గ్రామీణ సహకార బ్యాంకులు(ఆర్‌సిబి)లకు అనుమతి ఇచ్చారు. ఇక ఇంటివద్దకే సేవలందించేందుకు అర్బన్ కొఆపరేటివ్ బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ అనుమతిచ్చింది.
యుపిఐతో క్రెడిట్ కార్డ్‌ల లింక్
క్రెడిట్ కార్డ్‌లను యుపిఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కి లింక్ చేసేందుకు ఆర్‌బిఐ అనుమతి ఇచ్చింది. అంటే వచ్చే రోజుల్లో క్రెడిట్ కార్డ్‌లను కూడా యుపిఐకి లింక్ చేయడం ద్వారా లావాదేవీలు సులభతరం అవుతాయి. ఇది రూపే క్రెడిట్ కార్డ్‌తో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం యుపిఐ వినియోగదారులు డెబిట్ కార్డ్‌లు, సేవింగ్స్, కరెంట్ ఖాతాలను జోడించడం ద్వారా మాత్రమే యుపిఐ లావాదేవీల సౌకర్యాన్ని పొందుతున్నారు. క్రెడిట్ కార్డ్‌ని యుపిఐతో లింక్ చేయడానికి ఎన్‌పిసిఐకి దీనికి సంబంధించిన సూచనలు జారీ చేయనుంది.
లావాదేవీలకు కొత్త ఒటిపి నిబంధనలు
కార్డులు, యుపిఐ ద్వారా క్రమానుగత చెల్లింపులపై ఆటో డెబిట్ పరిమితిని పెంచుతున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇటువంటి చెల్లింపులపై పరిమితి గతంలో ఉన్న రూ.5000 నుంచి రూ.15 వేలకు పెరగనుంది. తాజా నిర్ణయంతో కస్టమర్లు తమ సబ్‌స్క్రిప్షన్, బీమా ప్రీమియం, ఎడ్యుకేషన్ ఫీజు వంటి నెలనెలా చెల్లించే లావాదేవీలకు రూ.15 వేల వరకు ఒటిపి లేకుండా లావాదేవీలు జరపొచ్చు. గతంలో ఈ పరిమితి రూ.5000 వరకు మాత్రమే ఉంది.
ఇఎంఐలు మరింత భారం
రేటు పెంపుతో గృహ రుణాల నుండి వాహన, వ్యక్తిగత రుణాల వరకు అన్నీ ఖరీదు అవుతాయి. ఇఎంఐలు మరింత పెరగనున్నాయి. గృహ రుణం వడ్డీ రేట్లు ఫ్లోటర్ ఫ్లెక్సిబుల్ అనే రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఫ్లోటింగ్‌లో రెపో రేటుతో సంబంధం లేకుండా మీ లోన్ వడ్డీ రేటు మొదటి నుండి చివరి వరకు అలాగే ఉంటుంది. రెండోది ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటును తీసుకోవడం ద్వారా రెపో రేటులో మార్పు ఉంటే, మీ లోన్ వడ్డీ రేటు కూడా మారుతుంది. రెపో రేటు అనేది బ్యాంకులు ఆర్‌బిఐ నుండి రుణం పొందే రేటు, అయితే ఆర్‌బిఐ వద్ద డిపాజిట్ చేసే బ్యాంకులకు చెల్లించే రేటును రివర్స్ రెపో రేటు అంటారు. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. దీంతో ఇఎంఐ కూడా తగ్గుతుంది. అదేవిధంగా రెపో రేటు పెరిగినప్పుడు వడ్డీ రేట్లు పెరగడం వల్ల కస్టమర్‌కు రుణ రేట్లు పెరగడంతో పాటు లోన్ ఇఎంఐలు భారం అవుతాయి. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు అధిక ధరలకు సెంట్రల్ బ్యాంక్ నుండి డబ్బును పొందుతాయి.