ప్రభుత్వానికి వాయు నాణ్యత కమిషన్ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న పరిస్థితుల్లో ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో బొగ్గు వినియోగాన్ని నిషేధించాలని వాయు నాణ్యత కమిషన్ (సిఎక్యుఎమ్) ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక, గృహ, ఇతర పనుల్లో బొగ్గు వాడకూడదని, ఈ నిబంధనను 2023 జనవరి 1 లోగా పూర్తిస్థాయిలో అమలు లోకి తీసుకురావాలని పేర్కొంది. అయితే థర్మల్ పవర్ ప్లాంట్లలో తక్కువ సల్ఫర్ బొగ్గు వాడకానికి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకముందే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ఏం చేయాలో చెప్పండి అంటూ ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీంతో బొగ్గు వాడకాన్ని నిషేధించడమే పరిష్కారమంటూ అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సూచనలు, ప్రతిపాదనలు పరిశీలించడానికి వాటిపై చర్చించడానికి సీఎక్యూఎం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. బొగ్గులాంటి శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలని , సాధ్యమైనంతవరకు క్లీనర్ ఇంధనాలను తప్పనిసరి చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు ప్రతి ఏటా 1.7 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నాయి. ఆరు ప్రధాన పారిశ్రామిక జిల్లాల్లోని పరిశ్రమలే దాదాపు 1.4 మిలియన్ టన్నుల బొగ్గును కాల్చుతున్నాయి. దీనికి తోడు ఇతర కాలుష్యాలు తోడై ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తోంది. శీతాకాలంలో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.