అమెరికాకు చైనా ఘాటైన చురక
బీజింగ్ : అమెరికా సైనికాధికారి ఫ్లిన్ చైనా సైనిక దురాక్రమణకు పాల్పడుతోందనే విమర్శలను చైనా అధికారికంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం అగ్గి రగల్చడానికే అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జావో లిజియన్ వ్యాఖ్యానించారు. లద్ధాఖ్ ప్రాంతంలో చైనా ఏర్పాట్లు, సైనిక కదలికలు అంతా కూడా కలవరానికి దారితీస్తున్నాయని, దీనిపై అన్ని పక్షాలూ స్పందించాల్సి ఉందని అమెరికా పసిఫిక్ ప్రాంత సైనిక దళాల అధికారి పరోక్షంగా భారత్‌కు బాసటగా మాట్లాడారు. భారత్ చైనాలు ఉభయపక్షంగా చిత్తశుద్ధితో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే సామర్థాన్ని సంతరించుకుని ఉన్నాయని, ఇప్పుడు ఈ దశలో అమెరికా హితబోధ ఎందుకు అని చైనా ప్రతినిధి ప్రశ్నించారు. ఇది ఇరుదేశాల కీలక అంశం. దీనిపై ఇతరులు ఎందుకు స్పందించడం? అని నిలదీశారు.
ఈ ప్రాంతంలో నిలకడ పరిస్థితిని కావాలనే దెబ్బతీయాలని అమెరికా వంటి కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని విమర్శించారు. కేవలం వేలెత్తి చూడానికి వీరు పనికివస్తారు తప్ప వారి తప్పులు ఎవరు చెప్పడానికి వీల్లేదనే రకం అన్నారు. ఈ ప్రాంతం శాంతి సుస్థిరతలకు యత్నిస్తే స్వాగతిస్తామని, అయితే అనుచిత వ్యాఖ్యలతో కలహాలు కల్పించేలా చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పుడు తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో దాదాపు రెండేళ్ల ప్రతిష్టంభన క్రమేపీ సద్దుమణిగి ఇప్పుడు నెమ్మది పరిస్థితి ఏర్పడిందని, దీనిని కాదనేలా అమెరికా వ్యాఖ్యానించడం ఎందుకు? అని ప్రశ్నించారు.