ముంబై : మహారాష్ట్ర నుంచి రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తనకు దిగ్భ్రాంతి కలిగించలేదు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అధికార కూటమికి తన ఓట్లన్నీ తనకు లభించాయని, కొందరు స్వతంత్రులు మాత్రమే బీజేపీకి ఓటు వేశారనిబీజ, ఈ ఫలితాల ప్రభావం తమ కూటమి ప్రభుత్వ స్థిరత్వంపై ఉండబోదని చెప్పారు. బీజేపికి మద్దతు ఇచ్చే ఓ ఇండిపెండెంట్ తమ వైపు వచ్చారన్నారు. స్వతంత్ర ఎమ్‌ఎల్‌ఎలను తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించారని అంగీకరించాలన్నారు.
నాలుగో అభ్యర్థి విజయం కోసం అవసరమైన ఓట్ల సంఖ్యలో ఇరు పక్షాల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ నాలుగో అభ్యర్థిని నిలిపే రిస్క్‌ను తమ కూటమి తీసుకుందన్నారు. అయితే కొందరు స్వతంత్రులను తమ వైపునకు తిపుకోలేక పోయామని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్‌సిపీ , కాంగ్రెస్, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 3, మహావికాస్ అగాడీ కూటమి 3 స్థానాలను దక్కించుకున్నాయి. బీజేపి అభ్యర్థులుగా పోటీ చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ రాష్ట్రమంత్రి అనిల్ బొండే, ధనంజయ్ మహడిక్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గఢ్, శివసేన నేత సంజయ్ రౌత్ గెలిచారు. శివసేన నేత సంజయ్ పవార్, బీజేపీ నేత ధనంజయ్ మహడిక్ మధ్య భీకర పోరు జరిగింది.