న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంపై భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు శనివారం భరోసా ఇచ్చారు. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్ ఏదీ కనబడలేదని, ఇంతవరకు పెరుగుతున్న కరోనా కేసులు కొన్ని జిల్లాలకే పరిమితమని వివరించారు. కొవిడ్ కట్టడికి తగినట్టు ప్రవర్తించక పోవడం, బూస్టర్ డోసు తీసుకోడానికి ఆసక్తి చూపించక పోవడం తదితర కారణాల వల్ల కొంత జనాభా వైరస్ సంక్రమణకు గురవుతున్నారని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కేరళలోని ఏడు జిల్లాలు, మిజోరం లోని ఐదు జిల్లాలతోపాటు దేశంలో మొత్తం 17 జిల్లాల్లో వారం వారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ నమోదవుతోందని, అలాగే కేరళలోని ఏడు, మహారాష్ట్రలోని నాలుగు, మిజోరం లోని నాలుగు జిల్లాలతోపాటు మొత్తం 24 జిల్లాల్లో వారం వారీ పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య నమోదవుతోందని వివరించారు. మొట్టమొదట మనం గమనించాల్సింది ఆందోళన కలిగించే కొత్త కరోనావేరియంట్ ఏదీ మనకు కనిపించలేదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ ఉప వేరియంట్లతో పోలిస్తే దేశంలో బిఎ 4, బిఎ 5, బిఎ 2 వేరియంట్లు కాస్త ఎక్కువ వ్యాప్తి చెందే లక్షణాలు కలిగినవని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు. దీనికి తోడు వేసవి శెలవులు, దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాల ఆంక్షల సడలింపు, వ్యాపారాలు ప్రారంభం కావడం, తదితర కారణాల వల్ల ఆరోగ్యబలహీనులకు వైరస్ వేగంగా సంక్రమిస్తోందని చెప్పారు. అత్యధిక జనసాంద్రత కలిగిన మహానగరాలు, మెట్రోసిటీల్లో ఇన్‌ఫెక్షన్ పరిమితమవుతోందని తెలిపారు.
ఈ రోజుల్లో ఎవరైతే ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారో వారు చాలామంది వ్యాధి నిరోధక శక్తివంతులవుతున్నారని, సాధారణమైన జలుబు, స్వల్ప అస్వస్థత పొందుతుండటం ముఖ్యమైన విషయంగా పేర్కొన్నారు. ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి) ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో మొదట టీకా రెండు డోసులు పొందినప్పటికీ ఆరు నెలల తరువాత యాంటీబాడీల స్థాయి క్షీణించిపోతుందని, అందువల్ల బూస్టర్ డోసు తీసుకుంటే ఇమ్యునిటీ స్పందన పెరుగుతుందని తేలినట్టు వైద్య నిపుణులు వివరించారు. అయితే కొవిడ్ మాత్రం అంతం కాలేదని, ప్రికాషన్ డోసులతోపాటు పూర్తి వ్యాక్సినేషన్ ప్రతివారూ తీసుకోవలసిన అవసరం ఉందని, వ్యాక్సినేషన్ వల్లనే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ నివారణ అవుతుందని, ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండదని, మరణించే ప్రమాదం ఏర్పడదని డాక్టర్ నివేదిత గుప్తా సూచించారు. ఐసిఎంఆర్ ఎపిడెమియోలజీ, కమ్యూనికబుల్ డిసీజెస్ డివిజన్ అధిపతిగా నివేదిత ఉంటున్నారు.
Health Experts about Increasing Covid 19 Cases in India