Monday, November 18, 2024

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
దేశంలోనే మొదటిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో పెట్టుబడిని దక్కించుకున్న తెలంగాణ
రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎలేస్ట్ కంపెనీ
బెంగళూర్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాజేష్
ఎక్స్‌పోర్ట్ గ్రూప్ చైర్మన్

మన తెలంగాణ/హైదరాబాద్: భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా డిస్‌ప్లేఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి దక్కింది. సుమారు రూ.24 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలేస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం బెంగళూరులో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమావేశంలో ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలేస్ట్ కంపెనీ తెలంగాణలో డిస్‌ప్లేఫ్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ పెట్టుబడితో దేశంలో డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలేస్ట్ సంస్థ చరిత్రకెక్కనున్నది. ఈ కంపెనీ ప్రపంచ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్‌పోర్ట్ ద్వారా ఏర్పాటు చేయబడింది. అమొలెడ్ డిస్‌ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏలేస్ట్ కంపెనీని ఏర్పాటు చేయబడింది. డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో ఉన్న ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల శాస్త్ర సాంకేతికతల మేరకు తన ఉత్పత్తులను తయారు చేయనుంది.
రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను ఈ సంస్థ పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ పెట్టుబడి ద్వారా స్మార్టుఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్ వంటి డిస్‌ప్లేలను తయారు చేయనున్నది. డిస్‌ప్లేఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి రానున్న ఈ పెట్టుబడి కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా భారతదేశాన్ని సైతం చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాల సరసన నిలబెడుతుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గర్వకారణమన్నారు. భారతదేశ సెమీకండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాము చేసిన ఈ కృషి ఫలిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఎలేస్ట్ కంపెనీ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు.
డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటి ఇకోసిస్టంతో పాటు దాని అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఈ అతిపెద్ద పెట్టుబడి ప్రకటన తర్వాత సెమీ కండక్టర్, డిస్‌ప్ల్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలువబోతున్నదన్నారు.
అనంతరం రాజేష్ ఎక్స్‌పోర్ట్ చైర్మన్ రాజేష్ మెహతా మాట్లాడుతూ, తెలంగాణలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్‌ప్లేఫ్యాబ్ వలన ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్ లో 3000 మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. దీంతోపాటు డిస్‌ప్లే ఫ్యాబ్ భాగస్వాములతో పాటు ఈ రంగం అనుబంధం సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలేస్ట్ కంపెనీ, ఆరవ తరం అమోల్ డిస్‌ప్లే తయారీ ద్వారా భారతదేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలేస్ట్ సిఇఒ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Rajesh Exports to set up Rs.24000 crore in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News