Saturday, November 16, 2024

పెట్టుబడుల వరద

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రూ.700కోట్లతో పెట్టుబడి పెట్టనున్న అజ్యూర్ పవర్ గ్లోబల్
ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ తో జట్టు కట్టిన కంపెనీ
2.5 గిగావాట్ల సోలార్ సెల్ మరియు సోలార్ మాడ్యుల్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు
మూడు వేల మందికి ప్రత్యక్ష… పరోక్ష ఉపాధి అవకాశాలు
కంపెనీ ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తన కార్యకలాపాలను ప్రీమియర్ ఎనర్జీ సంస్థ మరింతగా విస్తరించనున్నది. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్‌తో జత కట్టిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ హైదరాబాద్‌లోని తన ప్లాంట్ ను మరింతగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. తన విస్తరణ కార్యకలాపాల ద్వారా సుమారు రూ. 4 వేల కోట్ల సోలార్ సేల్స్, సోలార్ మాడ్యుల్‌ను రానున్న నాలుగు సంవత్సరాలలో సరఫరా చేసేందుకు ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది.
ప్రీమియర్ ఎనర్జి, అజ్యూర్ పవర్ గ్లోబల్ సంస్థ రూ.700 కోట్లతో 1.25 గిగా వాట్లా చొప్పున సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ ప్లాంట్లను రెండింటిని (మొత్తం 2.5జిడబ్లూ) ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఇసిటిలో నూతన ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పత్రాలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. ఈ ఏడు వందల కోట్ల పెట్టుబడితో సుమారు మూడు వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానంతరం, అనుమతి పత్రాలను మంత్రి కెటిఆర్ అందించారు. ఈ సందర్భంగా కంపెనీ పెట్టుబడులను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియర్ ఎనర్జీ వంటి కంపెనీలు తిరిగి మరిన్ని పెట్టుబడులు పెట్టడం అంటే తెలంగాణలో ఉన్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు అద్దం పడుతోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రీమియర్ ఎనర్జీ, అజ్యూర్ పవర్ గ్లోబల్ మరింతగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. కంపెనీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుజు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
ప్రపంచస్థాయి సోలార్ మాడ్యుల్, సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు అజ్యూర్ పవర్ గ్లోబల్ చైర్మన్ అలన్ రోస్లింగ్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రంగంలో తయారీ ప్లాంట్ ఉన్న కొన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలబడుతుందన్నారు. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియర్ ఎనర్జీ, అజ్యూర్ పవర్ గ్లోబల్ తో సోలార్ తయారీ కార్యకలాపాల విస్తరణ కోసం జట్టు కట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలు, స్నేహపూర్వక పారిశ్రామిక వాతావరణం వల్లనే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్, చిరంజీవి సలుజ, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమకు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఆటో మొబైల్ రంగంలో….అద్భుత అవకాశాలు
ఆధునిక ఆటో మొబైల్ రంగంలో హైదరాబాద్ పురోగమిస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయా రంగాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. కేవలం ఒక్క ఆటోమొబైల్ రంగమే కాకుండా…. పలు రంగాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థలు కూడా తమ వ్యాపారాలను నెలకొల్పేందుకు పెద్దఎత్తున ఆసక్తిని చూపిస్తున్నాయన్నారు. కోకాపేటలో అడ్వాన్స్ ఆటో పార్ట్ గ్లోబల్ కెపాబిలిటి సెంటర్ (జిపిసి) సంస్థను మంత్రి కెటిఆర్ సోమవారం ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన స్వాగతించారు. వచ్చే ఫిబ్రవరిలో నగరంలో ‘ఫార్ములా-ఇ’ని ప్రారంభించబోతున్నామన్నారు. అడ్వాన్స్ ఆటో పార్ట్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడంతో సుమారు 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్వాన్స్ ఆటో పార్ట్ ప్రెసిడెంట్, సిఇఒ టామ్ గ్రీకో, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

పనికిమాలిన డబుల్ ఇంజిన్‌లు అక్కర్లేదు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని…. ఆర్థికంగా మరింత పరిపుష్ఠం అవుతోందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ జిడిపిలో ఐదు శాతం వాటా అందిస్తోందని తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో ఆర్‌బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ దేశ జిడిపిలో 5 శాతాన్ని కలిగి ఉందని పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశానికి రెండింతల ప్రభావం చూపగల పరిపాలన అవసరమన్న కెటిఆర్…. పనికిమాలిన డబుల్ ఇంజిన్‌లు అక్కర్లేదని మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Azure Power Global to invest rs 700 crore in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News