ములుగు: ధరణి పోర్టల్‌పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారం, వచ్చిన ఫిర్యాదులను ఏలా పరిష్కారం చేయాలనే అంశాలపై సమాలోచనలతో చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో ధరణి పోర్టల్‌పై సంబంధిత అధికారులతో మంత్రి, సీఎస్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించాలన్నారు.
ఈ సమీక్షలో రాష్ట్ర ఉన్నతాధికారులు సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీఎస్ టెక్నీకల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికార యంత్రాంగం తదితరులు ఉన్నారు. ధరణి సమస్యల అధ్యయనంకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చించి, వాటిలో టెక్నీకల్ గా ఎదుర్కొంటున్న అంశాలపై కూలంకషంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి డివిజన్ పరిధిలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో 186, అలాగే ములుగు మండలంలో 46 ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు.