న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్నందున ప్రత్యేక విభాగాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ ఏర్పాటు చేసింది. జులై 18న జరగనున్న ఈ ఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ నియామకమయ్యారు. ఈ ప్రత్యేక విభాగానికి ఆయనే నిర్వాహకులు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏర్పాటైన ఈ ప్రత్యేక విభాగానికి రాజ్యసభ సెక్రటేరియట్ కార్యాలయంకు దాదాపు అధికారులంతా విధులు నిర్వహిస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ముకుల్ పాండే, రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ సురేంద్రకుమార్ త్రిపాఠీ వ్యవహరిస్తారు. దేశం మొత్తం మీద ఈ ఎన్నిక జరగనున్నప్పటికీ ఓట్ల లెక్కింపు మాత్రం పార్లమెంట్‌లోనే జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభ సెక్రటేరియట్‌ల అధికారులు ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. బుధవారం నుంచి నామినేషన్ పత్రాలు పార్లమెంట్‌లో లభ్యమౌతాయి. పోటీ చేయాలనుకునేవారు ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుంచి 50 మంది వంతున ప్రతిపాదకులను, బలపరిచేవారిని సమకూర్చుకోవలసి ఉంటుంది. అభ్యర్థి రూ. 15,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఎంపిలు, ఎమ్‌ఎల్‌ఎలు మొత్తం 4809 మంది రాష్ట్రపతిని ఎన్నుకోవలసి ఉంటుంది.