ప్రజలకు పాక్ మంత్రి వేడుకోలు
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ తన దేశ ప్రజలను చాయ్‌పై కోత విధించుకోవాలని విజ్ఞప్తి చేసింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండడంతో దేశంలో దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి దేశ ప్రజలు తేనీరు సేవనంపై త్యాగం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజలు రూ. 83.88 బిలియన్ల(400 మిలియన్ అమెరికన్ డాలర్ల) విలువైన తేయాకుని వినియోగించినట్లు లెక్కలు చెబుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ దేశ ప్రజలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యధికంగా తేయాకును దిగుమతి చేసుకుంటున్న దేశం పాకిస్తాన్ అని, దీని దిగుమతి కోసం ప్రభుత్వం అప్పులు చేయవలసి వస్తోందని ఆయన తెలిపారు. రుణంపై తేయాకు దిగుమతి చేసుకుంటున్న కారణంగా రోజుకు 1 లేదా 2 కప్పుల తేనీటికి ప్రజలు పరిమితం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా..మంత్రి అహ్సన్ ఇక్బాల్ తేయాకు వినియోగాన్ని తగ్గించుకోవాలని ఇచ్చిన పిలుపుపై ప్రజలు మండిపడుతున్నారు. ట్విటర్‌లో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము టీ తాగడం తగ్గించే ప్రసక్తి లేదని వారు తెగేసి చెబుతున్నారు.