7 రోజుల పోలీసు కస్టడీ..విచారణ షురూ
చండీగఢ్ : కట్టుదిట్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల మధ్య గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను పంజాబ్ పోలీసులు ఢిల్లీ జైలు నుంచి బుధవారం తెల్లవారుజామున తీసుకువచ్చారు. ప్రఖ్యాత గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలో బిష్ణోయ్‌ను విచారించేందుకు పంజాబ్ పోలీసు బృందం ఢిల్లీకి వెళ్లింది. ఆయనను మాన్సా జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. దీనితో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తి ఆయనకు ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిని ఇస్తూ ఆదేశాలు వెలువరించారు. అంతకు ముందు రోజు బిష్ణోయ్‌ను తీసుకువెళ్లేందుకు ఢిల్లీ కోర్టు పంజాబ్ పోలీసులకు వీలు కల్పించింది. కేసుకు సంబంధించి ఆయనను పద్ధతి ప్రకారం అరెస్టు చేసిన తరువాత పోలీసులు ఆయనను పంజాబ్‌కు తీసుకువెళ్లారు. రిమాండ్ ఉత్తర్వుల తరువాత ఆయన విచారణకు చండీగఢ్‌కు సమీపంలోని ఖరార్‌కు తీసుకువెళ్లారు. ఇంటరాగేషన్‌కు పంజాబ్ పోలీసు టీం సిద్ధం అయింది. మూసేవాలా హత్యకు సంబంధించి ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఏర్పాటుఅయింది.
దర్యాప్తులో క్రమేపి పురోగతి కన్పిస్తోందని పంజాబ్ పోలీసు అదనపు డిజిపి ప్రమోద్ బన్ తెలిపారు. బిష్ణోవ్‌ను విచారించితే కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, దర్యాప్తు క్రమంలో మరింత పురోగతి ఏర్పడుతుందని పంజాబ్ పోలీసు ఆశిస్తోంది. ఢిల్లీ నుంచి బిష్ణోయ్ తరలింపునకు 50 మంది పంజాబ్ పోలీసులు , బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వెంబడిస్తూ 12 ఇతర పోలీసు శకటాలతో రోడ్డు మార్గం ద్వారా ఆయనను పంజాబ్‌కు తీసుకువచ్చారు.