ఇడి ప్రశ్నలకు రాహుల్ జవాబు
యంగ్‌ఇండియన్ ధార్మిక సంస్థనే
లాభాపేర్జనకు పెట్టలేదని వివరణ
వాదనను తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థ
ఆధారాలు తెలియచేయాలని డిమాండ్
మొత్తం మీద 30 గంటల విచారణ
తిరిగి శుక్రవారం హాజరీకి ఆదేశాలు
న్యూఢిల్లీ : వరుసగా మూడోరోజు బుధవారం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారించింది. ఇక్కడ ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను కలుసుకునివారితో మాట్లాడిన తరువాత ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. విచారణకు హాజరయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో రాహుల్ సుదీర్ఘ విచారణ సాగుతోంది. యంగ్ ఇండియన్ సంస్థ నుంచి ఒక్కపైసా కూడా తీసుకోలేదని రాహుల్ పలుప్రశ్నల దశలో రాహుల్ ఇడి ముందు చెప్పినట్లు వెల్లడైంది. కాంగ్రెస్ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేటు సంస్థలో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు, ద్రవ్య దారి మళ్లింపు అభియోగాలపై రాహుల్‌ను ఇడిలోని అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి ప్రశ్నించారు. ప్రత్యేకించి యంగ్ ఇండియన్ పుట్టుపూర్వోత్తరాల గురించి, డబ్బుల లావాదేవీలపైనే ఇడి దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్ పార్టీకి చిరకాలం అధికార పత్రికగా చలామణి అయిన నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియన్ యాజమాన్యంలో ఉంది. పత్రిక ప్రచురణ బాధ్యతలు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) పర్యవేక్షించింది.
ఇడి ప్రశ్నలకు రాహుల్ సమాధానాలు వెలువరించారు. బుధవారం రెండు దఫాల విరామం నడుమ రాహుల్‌ను 9 గంటలపాటు విచారించారు. యంగ్ ఇండియన్ సంస్థ లాభాపేర్జనల కంపెనీ కాదు. కంపెనీ చట్టాల ప్రత్యేక నిబంధనల పరిధిలోనే దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ ఇండియన్ సంస్థ నుంచి కాంగ్రెస్‌కు ఒక్కపైసా కూడా బదలాయించలేదని వివరించారు. అయితే ఈ వాదనను ఇడి వర్గాలు తోసిపుచ్చాయని వెల్లడైంది. 2010లో ఈ కంపెనీ ఏర్పాటు అయిన నాటి నుంచి కూడా పరిశీలిస్తే దీని తరఫున ఏ ఒక్క ధార్మిక సహాయక చర్య చేపట్టిన దాఖలాలు లేవని తెలిపారు. యంగ్ ఇండియన్ సంస్థ ఏదైనా ఛారిటబుల్ కార్యక్రమం చేపట్టి ఉంటే సంబంధిత పత్రాలతో కూడిన ఆధారాలను తమ ముందు పెట్టగలరా? అని ఇడి ప్రశ్నించింది. అబ్దుల్ కలాం రోడ్‌లోని ఇడి కార్యాలయానికి రాహుల్ ఉదయం 11.35 గంటలకు హాజరయ్యారు.
జడ్ ప్లస్ సిఆర్‌పిఎఫ్ కేటగిరి భద్రతతో ఆయన తరలివచ్చారు. ఆయన వెంబడి పార్టీ ప్రధాన కార్యదర్శి, సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు. రాహుల్‌ను బుధవారం దాదాపు 15 , 16 ప్రశ్నలు వేసిందని వెల్లడైంది. ఇవన్నీ కూడా ఎజెఎల్, యంగ్ ఇండియన్ సంస్థల నిర్వహణ, వాటి లావాదేవీలకు సంబంధించినవే. మొత్తం మీద మూడు రోజులుగా బ్రేక్‌ల నడుమ 30 గంటల ఇంటరాగేషన్‌ను రాహుల్ గాంధీ ఎదుర్కొన్నారు. తిరిగి ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు రావాలని ఇడి ఆదేశించింది.