Friday, December 20, 2024

ఇదేం జుమ్లా?

- Advertisement -
- Advertisement -

ఏటా 2కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది?
కేంద్రంలో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఎనిమిదేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో
ప్రధాని మోడీ చెలగాటమాడారు
ఎన్నికలకు ఏడాది ముందు కొలువుల భర్తీ గుర్తొచ్చిందా?
చిన్న రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే 1,30,000
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం
ప్రైవేట్ రంగంలో 16లక్షల మందికి ఉపాధి కల్పించాం
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ విమర్శనాస్త్రాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడానికి ముందుకు రావడం మరో జుమ్లాగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై మోడీ సర్కార్ వెంటనే ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన ట్విట్టర్ వేదిక ద్వారా మరోసారి మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఎన్నికల ఏడాదికి సరిగ్గా ఏడాది ముందు ఉద్యోగాలు ప్రకటించడం దేనికి సంకేతమని కెటిఆర్ ప్రశ్నించారు. కనీసం ఎన్నికల ముందు అయినా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మోడీకి గుర్తుకురావడాన్ని స్వాగతిస్తున్నట్లు కెటిఆర్ వ్యంగ్యస్త్రాలను సంధించారు. అయితే ముందుగా కొన్ని సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం ఉందన్నారు. మంజూరైన 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో, రంగాల వారీగా, పిఎస్‌యు వారీగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు.

గత ఎనిమిదేళ్లలో దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం చేసిన కోలుకోలేని నష్టం చేసిందన్నారు. వారికి జరిగిన అన్యాయంపై మోడీ వెంటనే స్పందించాలన్నారు. అలాగే గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ, పిఎస్‌యూ రంగాల్లో రిక్రూట్‌మెంట్ ఎందుకు జరగలేదన్న విషయంపై వివరణ ఇవ్వాలన్నారు. ఇక ప్రయివేట్ రంగంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందన్న అంశంపై ప్రధానమంత్రి దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు.

చిన్న రాష్ట్రమైన తెలంగాణ గత 8 సంవత్సరాలలో 1,35,000 ఉద్యోగాలను భర్తీ చేశామని ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ వివరించారు. మరో 1 లక్ష ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిష్పత్తిలో 2014 నుండి ఇప్పటి వరకు 140 కోట్ల భారత జనాభా కోసం మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను సృష్టించారని కెటిఆర్ ప్రశ్నించారు.
కేంద్ర నుంచి ఎటువంటి సాయం లేకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులను సాధించిందన్నారు. ఫలితంగా ప్రైవేట్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇదే రీతిలో 8 ఏళ్లలో పెట్టుబడుల ద్వారా కేంద్రంలో ఉన్న మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలన్నారు. దేశంలోని యువతకు మీరు చేసిన వాగ్దానం మేరకు 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాల్సిన అవసముందన్నారు.

అదే సమయంలో అనేక హామీలను నెరవేర్చని కారణంగా ప్రధాని మోడీని నమ్మడం కూడా కష్టమేనని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని ఆయన మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై కక్షకట్టి ఎటువంటి సాయం అందించడకుండా ఫెడరల్ స్పూర్తిగా పూర్తిగా విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాటమాడిందన్నారు. ఇందుకు బిజెపి సర్కార్ తగు మూల్యం చెల్లించకతప్పదని ఈ సందర్భంగా కెటిఆర్ హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News