Thursday, September 19, 2024

యువత కోపాగ్ని.. ‘రైళ్లు బుగ్గి’

- Advertisement -
- Advertisement -

అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాలలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ఆర్మీ ఉద్యోగార్థుల మెరుపుదాడి
రైలు బోగీలకు నిప్పు, పలు రైళ్ల అద్దాలు ధ్వంసం
ప్లాట్‌ఫాంపై దుకాణాలు లూటీ పోలీసుల కాల్పులు, ఒకరి
మృతి, 15మందికి గాయాలు గాయపడిన వారిలో
పలువురి పరిస్థితి ఆందోళనకరం తొమ్మిది గంటల పాటు
సాగిన ఆందోళనకారుల నిరసన పట్టాలపై బైఠాయింపు
సాయంత్రం నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్న
పోలీసులు ఎట్టకేలకు పోలీసుల ఆధీనంలోకి రైల్వేస్టేషన్
55 రైళ్లు రద్దు సాయంత్రం వరకు నడవని
మెట్రో రైళ్లు రాత్రి 7 గంటల నుంచి రైళ్ల రాకపోకల
పునరుద్ధరణ బీహార్‌లోనూ రైళ్లకు నిప్పు, ఊపిరాడక ఒకరి
మృతి నేతల ఇళ్లపైనా కొనసాగిన దాడులు

విధ్వంసం మూల్యం రూ.7కోట్లు
30 బోగీలు పాక్షిక ధ్వంసం
నాలుగు కోచ్‌లకు నిప్పు
7 లోకోమోటో ఇంజిన్ల బూడిద
రైల్వే డిఆర్‌ఎం గుప్తా వెల్లడి

పట్నంల ‘అగ్గి’ పుట్టింది. గురువారం ఉత్తరాదికే పరిమితమైన హింస శుక్రవారం ఒక్కసారిగా మన సికింద్రాబాద్‌ను వణికించింది. ఆర్మీ ఉద్యోగార్థుల హింసోన్మాదంలో రైల్వే ప్రయాణికులు చిగురుటాకులా వణికారు. వారి ఆగ్రహానికి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ బుగ్గి అయ్యింది. ఉదయం ప్రారంభమైన విధ్వంసకాండ సాయంత్రం ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో సద్దుమణిగింది. ఓ ఆశాజీవి ప్రాణం అనంతవాయువులో కలిసింది.

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకా ల కోసం కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి న ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగాపెద్ద ఎత్తున ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. ప లు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు, రైల్వే ఆస్తులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాలకు ఈ నిరసనలు పాకగా మొత్తం 200కు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ బీహార్‌లో శుక్రవారం మూడో రోజు కూడా ఆందోళనలు కొ నసాగాయి. పలుప్రాంతాల్లో ఆందోళనకారు లు రహదారులు, రైల్వేట్రాక్‌లపైకి చేరి నిరసనలు చేపట్టారు. బెగుసరాయ్ జిల్లా లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న రైలుకు నిప్పు పె ట్టారు. మరోవైపు బెట్టాయ్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు గా యపడ్డారు.లఖిసరాయ్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అతడిని ఆ స్పత్రికి తరలించగా అతను చికిత్స పొందు తూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

యుపిలోనూ ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో రైల్వే స్టేష న్ల వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగా రు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. అయితే ఆ స మయంలో ప్రయాణికులెవరూ లేకపోవడం తో ప్రాణనష్టం సంభవించలేదు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బల్లియా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బల్లియావారణాసి మెమూ, బల్లి యా షాగంజ్ రైళ్ల బోగీలకు నిప్పుపెట్టిన దృశ్యాల వీడియోలు వైరల్ అయ్యాయి. ఆందోళనకారులు రైల్వే గోడౌన్ సమీపంలో షాపులపైన రాళ్లు రువ్వారు. రైల్వే స్టేషన్‌ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రైవేటు షాపులపైనా దాడి చేశారు. అలీగఢ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ క్ర మంలో ఆందోళకారులు పోలీసు వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిం ది. ఆగ్రాలక్నో హైవేపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో నాలుగు బసులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని హల్దానీ ప్రాంతంలో ఆందోళనకారులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా ఆందోళనకారులు వారి తో వాగ్వాదానికి దిగారు. లాఠీచార్జి చేశారు.

గురుగ్రామ్‌లో 144 సెక్షన్

హర్యానాలోనూ అగ్నిపథ్‌పై ఆందోళనలు చెలరేగాయి.నిరసనకారులు రహదారులను నిర్బంధించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నగరమంతటా 144 సెక్షన్‌ను విధించారు.

ఢిల్లీలో మెట్రోల వద్ద భద్రత

ఢిల్లీలో ఛాత్ర యువ సంఘర్ష్‌సమితి నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా పో లీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనల దృష్టా పలు మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో విద్యార్థులు రోడ్లపై టైర్లకు నిప్పంటించి ధర్నా చేపట్టారు. ఒడిశాలోని కటక్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న వందలాది మంది విద్యార్థులు కటక్‌లో రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో పాటుగా కంటోన్మెంట్ ఏరియాలు పలు హోర్డింగ్‌లను చించివేశారు. ఆందోళనకారుల్లో చాలా మంది గత ఏడాది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ పరీక్షలు పాసయి కామన్ ఎంట్రన్స్ పరీక్ష(సిఇఇ) రాయడానికి ఎదురు చూస్తు న్న వారే కావడం గమనార్హం. బాలసోర్ జి ల్లాలో ఆర్మీలో చేరడానికి ఎదురు చూస్తున్న ధనంజయ్ మొహంతీ నిరాశకు లోనయి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త పొక్కడంతో వీరంతా ఆందోళనకు దిగారు. అతను ఏడాదిన్నర క్రితమే దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణుడయి రాతపరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యుద్ధం జరిగింది. ఆర్మీ ఉద్యోగార్ధులు చేసిన ఆందోళనలు, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ఆకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి చేరి విధ్వంసం సృష్టించారు. వేలాదిమంది నిరసనకారులు రైల్వే స్టేషన్‌లో బోగీలను, పార్శిల్ కార్యాలయంలో ఉన్న బైక్‌లను తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. రైల్వే బోగీలు ఖాళీ బూడిదయ్యాయి. స్టేషన్‌లో ఉన్న షాపులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఊహించని పరిణామంపై షాక్‌కు గురైన రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై నిరసనకారులను చెరదగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మరో 10 మందికి పోలీసులు చేసిన లాఠీచార్జీతో దెబ్బలు తగిలాయి. నిరసనకారులు సృష్టించిన విధ్వంసానికి ఆందోళనకు గురైన దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకంగా 71 రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచారు. నిరసనకారులు మూడు రైలు బోగీలకు నిప్పుపెట్టడంతో స్టేషన్ ప్రాంగమంతా భయానక వాతావరణం నెలకొంది. నిరసనకారుల నినాదాలు, పోలీసుల లాఠీచార్జీలు, ఆందోళనకారుల ఆర్తనాదాలు, పోలీసుల బూట్లచప్పుళ్లు, నిరసనకారులు సృష్టించిన విధ్వంసం, అరుపులు, కేకలు, భయాందోళనలు, ప్రయాణికులు పరుగులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు విధ్వంసం

ఈ పరిస్థితిని సమీక్షించిన హైదరాబాద్ మెట్రోరైలు ఉన్నతాధికారులు తమ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఉద్యమ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసి అధికారులు సికింద్రాబాద్ వైపు తిరిగే సిటీ సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం దావానంలా నగరం మొత్తం వ్యాపించడంతో సికింద్రాబాద్ ప్రాంతంలోని షాపులు, మార్కెట్‌లను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ పరిస్థితిని సమీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా రైల్వే పోలీసులతో జత కలిశారు. ఉద్యమకారులను శాంతింప చేసేందుకు వారు విఫలయత్నం చేశారు. అయినా వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చావనైనా చస్తాంకానీ, ఆందోళనలను విరమింపచేసేది లేదని, అగ్నిపథ్‌ను రద్దు చేసేంతవరకు, అర్ధాంతరంగా నిలిపివేసిన ఆర్మీ నియామక ప్రక్రియను పూర్తి చేసేంతవరకు ఆందోళనను విరమించేది లేదని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరసనకారులు విధ్వంసం సృష్టించి పట్టాలపై భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు లాఠీచార్జీ చేసినా, కాల్పులు జరిపినా ఆందోళనకారులు తమ నిరసనను సుమారుగా 9 గంటల పాటు కొనసాగించారు.

ఆర్టీసి బస్సులపై దాడులు….

నిత్యం వేలాదిమందితో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిపథ్ ఘటనతో వార్తల్లో నిలిచింది. శుక్రవారం నిరసనకారులు చేసిన విధ్వంసంతో సికింద్రాబాద్ స్టేషన్ పేరు దేశమంతా మారుమోగ్రింది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ సర్వీసుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యతిరేకిత వస్తుండగా ఆ నిరసన సెగ శుక్రవారం హైదరాబాద్‌కు తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు ఆందోళనకు దిగడంతో పాటు రైలు బోగీలకు నిప్పుపెట్టారు. స్టేషన్ బయట ఉన్న ఆర్టీసి బస్సులపై దాడులు చేసి, ఆందోళనకారుల నిరసన వ్యక్తం చేయడంతో సికింద్రాబాద్ ప్రాంగణమంతా అట్టుడికిపోయింది.

ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు

ఉదయం స్టేషన్ బయట ఓ బస్సు అద్దాలు పగులగొట్టిన ఆందోళనకారులు ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. వెనువెంటనే ఫ్లాట్‌ఫారం మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. దీంతోపాటు పట్టాల మధ్యలో నిప్పు పెట్టారు. దీంతో ప్రయాణికులు రైళ్లను వదిలి పరుగులు పెట్టడంతో స్టేషన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను వేసి…..

రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను వేసిన ఆందోళనకారులు వాటిని కాల్చివేసి తమ నిరసనను తెలియచేశారు. అనంతరం ఆందోళనకారులు స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలు బోగీలకు నిప్పంటించి, రైళ్ల అద్దాలను ధ్వంసం చేసి భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. ఆ సమయంలో రైళ్లలో ఉన్న ప్రయాణికుల వస్తువులు సైతం ఆందోళనకారుల దాడిలో ధ్వంసమయ్యాయి. గూడ్స్‌లో ఉన్న బైక్‌లను కిందకు దింపి వాటికి నిరసన కారులు నిప్పంటించారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న దుకాణాలను ధ్వంసం చేసిన నిరసనకారులు కనిపించిన వస్తువునల్లా ధ్వంసం చేసి రైల్వేస్టేషన్‌ను రణరంగంలా మార్చారు. ఈనేపథ్యంలోనే రైల్వే అధికారులు రైళ్లను నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

అధికారులు వస్తే డిమాండ్లు వారి ముందు

అయితే నిరసనకారులతో సాయంత్రం చర్చలు జరపాలని పోలీసులు, రైల్వే అధికారులు భావించిన నేపథ్యంలో 10 మందిని చర్చలకు రావాలని ఆహ్వానించారు. చర్చలకు ఆందోళనకారులు ససేమిరా అనడంతో పాటు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ అధికారులు వచ్చే వరకు తమ నిరసన కొనసాగిస్తామని ఆందోళనకారులు పోలీసులతో పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు వస్తే తమ డిమాండ్లను వారి ముందు పెట్టడానికి సిద్ధమని నిరసనకారులు వెల్లడించారు.

ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తూ విధ్వంసానికి దిగారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో నిరుద్యోగులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురికి బుల్లెట్ గాయాలు కాగా మరికొందరికి పోలీసులు చేసిన లాఠీచార్జీలో దెబ్బలు తగిలాయి. వారికి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

రాకేష్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం, దబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేష్(18)కు ఛాతీలో బుల్లెట్ దిగడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రాకేష్ సోదరి బిఎస్‌ఎఫ్‌లో పనిచేస్తోంది. గాయపడిన వారిలో ఇద్దరికి గాంధీ వైద్యులు ఆపరేషన్ చేశారు. గాయపడిన వారిలో లకా్ష్మరెడ్డి, వక్కరి వినయ్, విద్యాసాగర్, కామారెడ్డి జిల్లాకు చెందిన మోహన్, దండు మహేష్, ఖమ్మంకు చెందిన నాగేందర్ బాబు (21), ఎపిలోని కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ రంగస్వామి(20), వరంగల్‌కు చెందిన కుమార్, నిజాంసాగర్, కామారెడ్డికి చెందిన పరశురాం, కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన రాకేష్, మహబూబ్‌నగర్, పాలకొండ విల్‌కు చెందిన శ్రీకాంత్ ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేష్ మృతదేహానికి వైద్యు లు పోస్టుమార్టం చేశారు. అనంతరం వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వరంగల్‌కు తీసుకెళ్లారు.

పోలీసుల అదుపులో నిరసనకారులు…

అగ్నిపథ్ పథకానికి నిరసనగా సికింద్రాబాద్ స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 40మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిరసనకారులు స్టేషన్ నుంచి బయటికి పంపించేందుకు అదనపు పోలీసు బలగాలను ఉన్నతాధికారులు మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎక్కడికక్కడ లాఠీఛార్జ్ చేయడంతో నిరసనకారులు స్టేషన్ బయటకు పరుగులు తీశారు. దీంతో రైల్వే ట్రాక్‌లను పోలీసులు క్లియర్ చేశారు. స్టేషన్ మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. రైల్వే సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున బలగాలను స్టేషన్‌లో మోహరించారు. తొమ్మిది గంటల ఆపరేషన్ తర్వాత పోలీసులు అన్ని ట్రాక్‌లు, ఫ్లాట్‌ఫాంలను క్లియర్ చేశారు.

స్టేషన్‌ను క్లియర్ చేశాం : అదనపు కమిషనర్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించి వేశామని, రైల్వే స్టేషన్ తమ అదుపులో ఉందని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ఎఆర్ శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆయన, ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News