శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్, సాల్ట్
నెదర్లాండ్స్‌పై 498 పరుగులతో ప్రపంచ రికార్డు
అమ్స్‌టెల్విన్: వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ నయా చరిత్రను సృష్టించింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కొత్త చరిత్రను లిఖించింది. ఇప్పటి వరకు తన పేరిటే ఉన్న 481 పరుగుల రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డే క్రికెట్‌లోనే అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు శతకంతో కదం తొక్కడం విశేషం. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 26 సిక్సర్లు, 36 ఫోర్లు నమోదయ్యాయంటే బ్యాటర్లు ఏ స్థాయిలో విజృంభించారో ఊహించుకోవచ్చు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్, విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్ శతకాలతో విజృంభించారు. మరోవైపు లియామ్ లివింగ్‌స్టోన్ 22 బంతుల్లోనే 66 పరుగులు చేసి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్ 17 బంతుల్లోనే 50 పరుగులు సాధించి వన్డేల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీని పూర్తి చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఓపెనర్ సాల్ట్, వన్‌డౌన్‌లో వచ్చిన మలాన్‌లు నెదర్లాండ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇద్దరు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఈ జంటను విడగొట్టేందుకు నెదర్లాండ్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాల్ట్ 93 బంతుల్లోనే 14 ఫోర్లు, మరో మూడు బౌండరీలతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో మలాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 222 పరుగులు జోడించాడు.
బట్లర్ వీరవిహారం..
తర్వాత వచ్చిన వికెట్ కీపర్ జోస్‌బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కళ్లు చెదిరే శతకం సాధించాడు. అతన్ని ఎలా కట్టడి చేయాలో ప్రత్యర్థి బౌలర్లకు అంతుబట్టకుండా పోయింది. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన బట్లర్ 70 బంతుల్లోనే 14 భారీ సిక్సర్లు, మరో ఏడు ఫోర్లతో 162 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక మలాన్ 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. ఇదే సమయంలో బట్లర్‌తో కలిసి మూడో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. చివర్లో లివింగ్‌స్టోన్ కూడా చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన లివింగ్‌స్టోన్ 22 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 6 ఫోర్లతో అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ 498 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 266 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ 232 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వన్డేల్లో టాప్-5 అత్యధిక స్కోర్లు
1.ఇంగ్లండ్ 498/4 నెదర్లాండ్స్‌పై
2.ఇంగ్లండ్ 481/6
ఆస్ట్రేలియాపై
3.ఇంగ్లండ్ 444/3 పాకిస్థాన్‌పై
4.శ్రీలంక 443/9 నెదర్లాండ్స్‌పై
5.సౌతాఫ్రికా 439/2 వెస్టిండీస్‌పై