సంస్కరణలు కావు అవి విద్యుత్ రంగానికి ఉరితాళ్ళు
దేశాన్ని చీకట్లోకి నెట్టేలా మోడీ సర్కార్ నిర్ణయాలు
విద్యుత్ రంగ సంస్థలను ప్రవైటికరించేందుకే కుట్రలు
కార్పోరేట్ రంగాన్ని పెంచి పోషించింది బిజెపి సర్కారే
జాతీయ ఉత్పత్తులను ప్రోత్సహించలేదు
సంస్కరణలకువ్యతిరేకంగా ఉద్యమించాలి
ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు
సూర్యాపేట: బిజెపి పాలనలో ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి నెట్టి వెయ్యబడిందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు విద్యుత్ రంగానికి ఉరి తాళ్లుగా మరనున్నాయని ఆయన హెచ్చరించారు.అవే సంస్కరణలు ప్రజలకు గుది బండలుగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. అటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. అందుకు ప్రజలు ఉద్యుక్తులు కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలను ప్రవ్యతికరించే కుట్రలకు బిజెపి సర్కార్ తెరలేపిందన్నారు.అదే జరిగితే దేశ వ్యాప్తంగా చీకటి మయం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేట్ సంస్థలకు విద్యుత్ సంస్థ లను కట్టే బెట్టేందుకే కుట్ర పూరితంగా సంస్కరణలను మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చిందని ఆయన మండిపడ్డారు.
బిజెపి చెప్పేది జాతీయ వాదం చేసేది జాతికి ద్రోహం అని ఆయన విరుచుకుపడ్డారు. జాతీయ ఉత్పత్తులను ఏనాడు ప్రోత్సహించిన చరిత్ర బిజెపి పాలకులకు లేదన్నారు.వ్యవసాయ చట్టాలను తెచ్చి పంట పొలాలను కార్పోరేట్లకు అంతగట్టే దుర్బుద్ధికి తోడు ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో ఆ కార్పొరేట్లకు విద్యుత్ సంస్థలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.వ్యవసాయ చట్టాలను తెచ్చిన రోజున యావత్ రైతాంగం చేసిన తిరుగుబాటును ఆయన గుర్తు చేశారు.అదే తిరుగుబాటు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు దేశప్రజలకు కేంద్రం మొట్టమొదటి సారిగా క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడ్డ బిజెపి నాయకత్వంలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన మండిపడ్డారు.