అగ్నిపథ్‌పై యువత ఆందోళన తీవ్రతరం
చండీగఢ్: అగ్నిపథ్‌కు నిరసనగా హర్యానాలో పూలు చోట్ల నిరసనలు చెలరేగాయి. లూధియానా రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు విధ్వంసానికి దిగారు. ఆస్తినష్టం కల్గింది. హర్యానాలో శనివారం కూడా నిరసనలు చెలరేగాయి. మహేందర్‌గఢ్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపి ఉన్న వాహనాలను తగులబెట్టారు. ఓ వ్యాన్‌ను కూడా నిలిపివేసి నిప్పంటించినట్లు, 50 మందితో కూడిన బృందం విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జలంధర్‌లో యువకులు నిరసనలకు దిగారు. రామా మండి చౌక్ నుంచి పిఎపి చౌక్ వరకూ ప్రదర్శనలు సాగాయి.
యుపిలోని బలియాలోకేసులు
అగ్నిపథ్‌పై నిరసనల దశలో ఉత్తర ప్రదేశ్‌లోని బలియాలో దాదాపు 400 మంది గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసులు పెట్టారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు పెట్టినట్లు వివరించారు. శుక్రవారం యుపిలో కొన్ని చోట్ల నిరసనకారులు ఆస్తులకు నష్టం కల్గించిన ఘట్టాలు నెలకొన్నాయి.
కోచింగ్ సెంటర్ల పని అనే అనుమానాలు
బీహార్‌లో ఇప్పుడు అగ్నిపథ్‌పై నిరసనల వెనుక కోచింగ్ సెంటర్ల అదృశ్య హస్తం ఉందనే అనుమానాలు తలెత్తాయి. దీనిపై బీహార్ పోలీసులు శనివారం దర్యాప్తుచేపట్టాయి. సైన్యంలో రిక్రూట్‌మెంట్ల శిక్షణల కార్యక్రమాలు దెబ్బతింటాయని ఈ సెంటర్ల నిర్వాహకులు వెనక ఉండి హింసాకాండకు దిగుతున్నారనే ఆరోపణలు రావడంతో ఈ కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు బీహార్ పోలీసులు పాట్నాలో తెలిపారు. మరో వైపు ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపుతో 24 గంటల బీహార్ బంద్ శనివారం జరిగింది. అగ్నిపథ్ ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు జరిగాయి. బీహార్‌లోని తరెగానా రైల్వేస్టేషన్‌లో బంద్ మద్దతుదార్లు విధ్వంసానికి దిగారు. రైల్వే పోలీసుకు చెందిన జీపును తగులబెట్టారు.